‘మధ్యాహ్నం’ మంటలు
Published Fri, Jan 24 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
సాక్షి, నరసరావుపేట :పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా బడిమానివేసే పిల్లల సంఖ్యను తగ్గించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. మొదట్లో పథకం బాగానే నడిచినప్పటికీ రోజు రోజుకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధర లు ఆకాశాన్నంటుతుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ఏజెన్సీ నిర్వాహకులకు కష్టంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 100 గ్రాముల బియ్యంతో పాటు 4 రూపాయల 35 పైసలు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లిస్తోంది.
ప్రతి బుధవారం విద్యార్థులకు కోడిగుడ్డు అందించాలనే నిబంధన కూడా ఉండడంతో ప్రస్తుత మార్కెట్‌లో కోడిగుడ్డు ధర 4 నుంచి 5 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో ప్రభుత్వం తమకు చెల్లించే డబ్బు కోడిగుడ్డు కొనుగోలుకే సరి పోతుందని, ఇక మిగతా వంట ఎలా చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. బిల్లు లు కూడా ప్రతి నెలా రావడంలేదని, రెండు, మూడు నెలలకొకసారి వస్తుండటంతో మధ్యాహ్న భోజనం వండేందుకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోక విద్యార్థులకు సరైన పోషక ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
గుదిబండగా మారిన గ్యాస్ సరఫరా..
అసలే సమస్యల కుంపటిలో కొట్టుమిట్టాడుతున్న తమకు ఇటీవల ప్రభుత్వం గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికి 9 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ ధరల్లో ఇస్తామని, ఆపైన కావాలంటే రూ. 1350 చెల్లించాల్సిందేనంటూ ప్రభుత్వం నిబంధన విధించడం దారుణమని వాపోతున్నారు. రోజుకు 120 నుంచి 200 మంది విద్యార్థులకు వంట చేయాల్సిన తమకు వారానికి ఒక సిలిండర్ చొప్పున నెలకు 4, ఏడాదికి 40 సిలిండర్లకుపైగా అవసరం అవుతాయని, ప్రభుత్వ నిబంధనతో ఇక ఏజెన్సీలను మానుకోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
వంటశాలలు లేక ఆరుబయటే వంట
అధికశాతం ప్రభుత్వ పాఠశాలల్లో వంటశాలలు లేకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సిన దుస్థితి నెలకొందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి తమకు అందించే గ్యాస్, బిల్లులను పెంచాలని కోరుతున్నారు. అయితే వంటశాలల నిర్మాణానికి ఒక్కొక్క పాఠశాలకు రూ. 75వేలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుండటంతో ఆ మొత్తంతో నిర్మాణం చేపట్టలేక కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్లు పెంచాలి
ఏడాదికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రెట్టింపు ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మాకందించే బిల్లులను కూడా పెంచాలి.
- వెంకటరమణ, శ్రీనివాసగిరిజనకాలనీ
బిల్లులు పెంచి ఆదుకోండి
విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న బిల్లులు సరిపోవడంలేదు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెపుల్లలు కొనలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మొర ఆలకించాలి.
- శిరసగండ్ల లక్ష్మీ, మాచవరం
Advertisement
Advertisement