పాఠశాలలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలి
తిరుపతి: ‘విద్యార్థులలో సృజనాత్మకత, కొత్త విషయాలపై జి జ్ఞాస పెరగాలి. వారిలో దేశ భక్తిని, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించాలి. ఇది ప్రాథమిక విద్య స్థాయి నుంచి అమలు జరగాలి. ఆ సదుద్దేశంతోనే సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం’ అని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. ఆదివారం సా యంత్రం మహతి ఆడిటోరియంలో జిల్లా సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా ర మహోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రసంగిస్తూ పాఠశాల కాంప్లెక్స్‌లు సమగ్ర విజ్ఞాన నిలయాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫలితాలు ప్రధానం కాద ని ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులతో స్నేహం గా మెలగి వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దితే ఫలితాలు వాటంతట అవే వస్తాయన్నారు. ఉపాధ్యాయుల మధ్య నాలె డ్జ్ షేరింగ్ ఉండాలన్నారు. పాఠశాలలో ఇలాంటి సమగ్రత ఏర్పడినపుడు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివిధ మండలాలకు చెంది పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులకు ఆయన ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంసా పత్రాలను అందచేశారు.
స్ఫూర్తి నింపింది
సంకల్పం కార్యక్రమం తమలో స్ఫూర్తి నింపిందని పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసే సంప్రదాయానికి తోడుగా ఉపాధ్యాయుల పనితీరును అధ్యయనం చేసి ప్రశంసాపత్రాలు అందచేసే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ సిద్ధార్థ జైన్‌ను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అభిలషించారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ పథకాల ప్రగతిని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మి, డీవైఈవోలు శామ్యూల్, శేఖర్ పాల్గొన్నారు. జవహర్ బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆందరినీ ఆకట్టుకున్నాయి.
కుర్చీలు చాలక ఇబ్బందులు
సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి హాజరైన పలువురు కుర్చీలు లేక ఇబ్బంది పడ్డారు. ఉ త్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపికైన 1500 మందికి జిల్లా విద్యాశాఖ ఆహ్వానం పంపింది. అయితే కోరకనే వచ్చిన అవార్డును అందుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా తరలిరావడంతో మహతిలో కుర్చీలు చాలక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది కార్యక్రమం పూర్తయే వరకు నిల్చొనే ఉండాల్సి వచ్చింది.