చల్లపల్లి : ‘గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తాం’.. విద్యాశాఖ గతంలో ఇచ్చిన ప్రకటన ఇది. ఈ మేరకు జీవో కూడా ఇచ్చింది.
‘లక్ష రూపాయల జరిమానా తర్వాత కూడా తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తాం’..
ఇది జిల్లా విద్యాశాఖాధికారి ఇటీవల చేసిన హెచ్చరిక.
గుర్తింపు లేని పాఠశాలలపై అధికారులు, ప్రభుత్వం ప్రకటనలు, జీవోలు ప్రచారానికే పరిమితమవుతున్నాయి. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. గుర్తింపులేని పాఠశాలలు జిల్లాలో 145 ఉన్నా.. వాటిలో అడ్మిషన్లు శరవేగంగా జరిగిపోతున్నా.. వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు చొరవ చూపడం లేదు. జిల్లాలో 2012లో 300 గుర్తింపులేని పాఠశాలలు ఉండగా, గత ఏడాది 170కి తగ్గాయి. ఈ ఏడాది 145 ఉన్నాయి. అధికారులు కూడా గుర్తింపులేని పాఠశాలల జాబితాను ప్రకటించారు. అయినా వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోకపోవడం, పాఠశాలను సీజ్ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ప్రచారానికే పరిమితం...
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి పాఠశాలలను గుర్తించి వాటిలో విద్యార్థులు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని సీజ్ చేస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలలను 24 గంటల్లో సీజ్ చేయాలని కడప జిల్లా కలెక్టర్ శశిధర్ గురువారం ఆదేశించారు. మరికొన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు ఇలాంటి ఆదేశాలనే ఇచ్చి అమలు చేస్తున్నారు. మన జిల్లాలో మాత్రం ఇలాంటి పాఠశాలల జాబితాను కరపత్రాల రూపంలో ముద్రించి అవగాహన కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు.
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పేరుమోసిన కార్పొరేట్ పాఠశాలలకు సైతం గుర్తింపు లేకపోవడం గమనార్హం. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జరిమానాలు ఏమయ్యాయి?
గుర్తింపులేని పాఠశాలలు నిర్వహిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని విద్యాశాఖ గతంలో నిర్ణయించింది. అయినా ఆ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని గతంలో డీఈవో ఆర్భాటంగా ప్రకటించారు. గుర్తింపులేని పాఠశాలలు గత వారం రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తుండటం, అడ్మిషన్లు తీసుకోవడం చేస్తున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలేవీ
Published Sun, Jun 22 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM
Advertisement