స్ట్రక్చరల్ డిజైనింగ్‌లో మేటి
Published Sun, Jan 26 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
కొవ్వూరు, న్యూస్‌లైన్:అనుమోలు రామకృష్ణ కొవ్వూరులోనే పుట్టారు. గోదావరి గట్టువెంబడి తిరిగారు. ఇక్కడే చదివారు. దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగారు. 1939 డిసెంబర్ 20న జన్మించిన రామకృష్ణ ఇంటర్మీడియెట్ వరకూ కొవ్వూరులో విద్యనభ్యసించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేసిన అనంతరం తూర్పు జర్మనీ వెళ్లారు. అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో రాణించారు. నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలను ముందుండి నడిపించారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో రామకృష్ణ అందించిన సేవలను గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య ఉద్యోగరీత్యా కృష్ణాజిల్లా నుంచి వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. వెంకటప్పయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, రామకృష్ణ మొదటి వారు. రెండో కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యూరు. రామకృష్ణ కుటుంబం చెన్నయ్‌లో స్థిరపడింది.
తండ్రి జ్ఞాపకార్థం సేవలు
రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులంతా కలసి 2009లో వెంకటప్పయ్య చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు నాలుగేళ్ల నుంచి స్కాల ర్‌షిప్‌లు అందిస్తున్నారు. ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు వంటివి చెల్లిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోనూ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నారు. కొవ్వూరు వాసికి అరుదైన గౌరవం దక్కడంతో పట్టణ ప్రజలు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.
Advertisement