ఉత్కంఠకు నేడు తెర | screen off to suspense today | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు నేడు తెర

Published Mon, Aug 28 2017 1:16 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

కౌంటింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు - Sakshi

కౌంటింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు

– నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
– ఉదయం 8నుంచి కౌంటింగ్‌ ప్రారంభం
– మధ్యాహ్నం 12 గంటలకు ఫలితం వెల్లడి
– 600 మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు
– పట్టణంలో 144 సెక‌్షన్‌ అమలు
 
నంద్యాల ఉపఎన్నిక ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపడిన ఈ ఎన్నిక ఫలితం మధ్యాహ్నానికి వెల్లడికానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాల ఉపపోరు ఆసక్తికరంగా సాగింది. ఈ ఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు నడిచాయి. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కలిసినా నంద్యాలలో ఎవరు గెలుస్తారనే విషయంపై చర్చ సాగేది. సర్వేలు..విశ్లేషణలు.. సరేసరి. భారీ పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో గెలుపెవరిది అనే అంశం సోమవారం తేలిపోనుంది.   - నంద్యాల
 
నంద్యాల ఉపఎన్నిక కౌటింగ్‌కు అధికార యంత్రంగా భారీ ఏర్పాటు చేసింది. నంద్యాల పట్టణం  గిరినాథ్‌ సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉపఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 255 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 19 రౌండ్లలో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కౌంటింగ్‌కు 15 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపునకు 14, ఒక టేబుల్‌ రిటర్నింగ్‌ అధికారికి ఉంటుందన్నారు. ఒక్కో రౌండ్‌లో 8 నుంచి 10వేల ఓట్ల వరకు లెక్కించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 2,18,858 ఓటర్లు ఉండగా 1,73,189ఓటింగ్‌లో పాల్గొన్నారు. కౌంటింగ్‌ మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో 60మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేష్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు. 
 
ఓటింగ్‌ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు. ఈనెల 23వ తేదీన జరిగిన పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. వైఎస్సార్‌సీపీ పట్టు ఉన్న గోస్పాడు మండలంలో 90.81శాతం పోలింగ్‌ నమోదు కావడం, అలాగే నంద్యాల మండలంలో 87.61శాతం,  పట్టణంలో 74 శాతం పోలింగ్‌ జరగడంతో టీడీపీ నాయకులుఅలజడికి లోనవుతున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళా ఓటర్లు ఉండగా 88,639 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొనడంతో వైఎస్సార్‌సీపీకి కలిసి వస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  
 
ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఫలితాల వెల్లడి..
కౌంటింగ్‌ ఫలితాలను వెల్లడించేందుకుఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌ ఫలితాలను దీనిపైనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మీడియా సిబ్బందికి కౌంటింగ్‌ హాల్‌లోకి ప్రవేశం ఉండబోదు. ఎన్నికల అధికారి గుర్తింపు కార్డు ఉన్న వారు మాత్రమే కౌంటింగ్‌ హాల్‌ ప్రాంగణంలో ఉంటారు.
 
భారీ బందోబస్తు...
 కౌంటింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ గోపినాథ జట్టి.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 30 పోలీస్‌ యాక్టు, సెక‌్షన్‌ 144 అమలు చేస్తున్నామని, ఐదుగురి మించి ఎవరూ గుంపులుగా ఉండరాదన్నారు. కౌంటింగ్‌ హాల్‌ వద్ద మూండంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తర్వాత ర్యాలీలు, బాణ సంచా పేల్చరాదన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 5, స్పెషల్‌ స్టైకింగ్‌ ఫోర్స్‌ 3, మొబైల్‌ పార్టీలు 12, పికెట్స్‌ 21, పారా మిలటరీ సీఆర్‌పీఎఫ్‌ 1, నాలుగు ఏపీఎస్పీ ప్లటూన్లు, 12మంది డీఎస్పీలు, 18మంది సీఐలు, 63మంది ఎస్‌ఐలు, 58మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 232 మంది కానిస్టేబుళ్లు, 18మంది మహిళా కానిస్టేబుళ్లు, 12 స్పెషల్‌ పార్టీలు, 118 మంది హోంగార్డులు, మొత్తం 600మంది సిబ్బందిని బందోబస్తుకు విధులకు కేటాయించామన్నారు. 
 
రాకపోకల మళ్లింపు..
కౌంటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పాలిటెక్నిక్‌ కాలేజీ సమీపంలో ఉన్న ఐదు కాలనీల రహదారులను బ్లాక్‌ చేసినట్లు ఎస్పీ గోపినాథ్‌జట్టి తెలిపారు. ఎస్‌బీఐ కాలనీ, సుద్దులపేట, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్, పాలిటెక్నిక్‌ కాలేజీ, పద్మావతినగర్, సరస్వతినగర్, రెవెన్యూక్వార్టర్స్‌ రహదారుల గుండా వెళ్లే వాహనాలు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలో 144సెక‌్షన్‌ అమలులో ఉందని ఎస్పీ పేర్కొన్నారు.  కౌంటింగ్‌ హాల్‌ పరిసర ప్రాంతాలను, పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నంద్యాల నియోజకవర్గంలోని నాయకులు, గోస్పాడు మండలంలో నాయకుల ఇళ్ల వద్ద, గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement