స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్‌..సంజనారెడ్డి | Screenplay .. Direction .. Sajana Reddy | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్‌..సంజనారెడ్డి

Published Wed, May 30 2018 12:02 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Screenplay .. Direction .. Sajana Reddy - Sakshi

రాజుగాడు సినిమా షూటింగ్‌లో హీరో హీరోయిన్లకు సీన్లు వివరిస్తున్న సంజనారెడ్డి

టెక్కలి : ఆమె చదివిన చదువుకు, ఎంచుకున్న రంగానికి ఎటువంటి సంబంధం లేదు.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం స్వగ్రామం.. అక్కడి నుంచి సమీప పట్టణమైన టెక్కలిలో స్థిర నివాసం.. డిగ్రీ వరకు అక్కడే కొనసాగిన చదువు.. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ కోర్సు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానం చివరకు వెండితెర వరకు వెళ్లింది.

కొంతకాలం టీవీ చానెళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ చివరకు మహిళా దర్శకుల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుని కళామతల్లి సాక్షిగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారామె.. ఆమె మరెవరో కాదు దుక్క సంజనా రెడ్డి. ‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ రాజ్‌ తరుణ్, పూజిత, అమైరా దస్తూర్‌ నటీనటులుగా, రాజేంద్రప్రసాద్, సితార ప్రధాన పాత్రధారులుగా సంజనారెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి తెరకెక్కిన రాజుగాడు సినిమా జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విశేషాలు..

రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో..

సినిమా రంగంలో రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో సంజనారెడ్డి దర్శకత్వం వైపు దృష్టి సారించింది. నటి అక్కినేని అమల ప్రోత్సాహంతో ఓ యాడ్‌ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. అనతి కాలంలోనే రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించే చాన్స్‌ దక్కించుకున్నారు. కేవలం 42 రోజుల్లో సినిమాను పూర్తి చేసి చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో శభాష్‌ అనిపించుకున్నారు. జూన్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కావాలనే ఆశయం..

భవిష్యత్‌లో పురుషులతో సమానంగా సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కావాలనే ఆశయం ఉందని సంజనారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎంచుకున్న సినిమా రంగంపై తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నారు.  సందేశాత్మక, కమర్షియల్‌ సినిమాలు తీయడంతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు. కష్టపడే స్వభావంతో చేసే పనిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని సంజనారెడ్డి తెలిపారు.

 కుటుంబ నేపథ్యం..

ఇజ్జువరం గ్రామానికి చెందిన దుక్క తులసీరెడ్డి, అరవిందాక్షి దంపతుల పెద్ద కుమార్తె సంజనారెడ్డి పదో తరగతి వరకు టెక్కలి బాలి కోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బీఎస్‌ అండ్‌ జేఆర్‌ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి కొంతకాలం టెక్కలి పరి సర ప్రాంతాల్లో ప్రైవేట్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు. జీవి తంలో ఏదో సాధించాలనే తపనతో కొన్ని సాఫ్ట్‌వేర్‌ కోర్సులను అభ్యసించి హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యో గం సాధించారు.

అక్కడితో తృప్తి చెందక ఎలక్ట్రానిక్‌ మీడి యా వైపు దృష్టి సారించారు. ఓవైపు చానెళ్లలో పనిచేస్తూ కొన్ని ఇంగ్లీష్‌ పత్రికలకు కవర్‌ స్టోరీలు రాసే అలవాటు చేసుకున్నారు. ఈ కోవలో సినీ పరిశ్రమలో ప్రముఖులను కలిసే అవకాశం లభించింది. ఇదే సమయంలో నటుడు మోహన్‌బాబు కుటుంబంతో సంజనారెడ్డికు పరిచయం ఏర్పడింది.

రామ్‌గోపాలవర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, జయసుధ, మంచు విష్ణు ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన ‘రౌడీ’ సినిమా సెట్స్‌కు సంజనారెడ్డి  అప్పుడప్పుడు వెళ్తుండేవారు. అప్పుడే ఫిల్మ్‌మేకింగ్‌ చేయాలనే ఆలోచన కలిగిం ది. ముంబై వెళ్లి కొద్ది రోజులు వర్మ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ఇతర దేశాల్లో సినిమా నిపుణులను కలిసి ఫిల్మ్‌ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు.  

1
1/2

రాజేంద్రప్రసాద్‌కు సీన్‌ వివరిస్తున్న సంజనారెడ్డి

2
2/2

రాజుగాడు సినిమా షూటింగ్‌ స్పాట్‌లో దృశ్యాలను తిలకిస్తున్న సంజనారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement