జిల్లాకు ట్రైనీగా రావడం పూర్వజన్మ సుకృతం | Scripts to district trainers | Sakshi
Sakshi News home page

జిల్లాకు ట్రైనీగా రావడం పూర్వజన్మ సుకృతం

Published Sat, Jun 28 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

Scripts to district trainers

గుంటూరుసిటీ: చరిత్రాత్మకమైన గుంటూరు జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా రావడం తన పూర్వ జన్మ సుకృతమని జిల్లా ట్రైనీ కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు ఎంపికైన శివశంకర్ శుక్రవారం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆరు నెలలపాటు ఆయన ట్రైనీ కలెక్టరుగా విధులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 8వ తరగతి చదివే సమయంలో పాఠశాలకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను చూసి స్ఫూర్తి పొంది, తానూ కలెక్టర్‌ను కావాలనుకున్నానని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు.
 
 లక్ష్య సాధన కోసం రోజుకు 10 గంటలు కష్టపడి చదివినట్టు చెప్పారు. కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే  దేనినైనా సాధించవచ్చని అన్నారు. తాను ఐఎఎస్ పరీక్షల్లో మూడుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యానని, ఐదోసారి అనుకున్న లక్ష్యం సాధించానని చెప్పారు.  హైదరాబాద్‌లోని ఏపీ  స్టడీ సర్కిల్‌లో మాక్ ఇంటర్వ్యూలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనకు ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించారన్నారు.
 
 నేటి యువత  డిగ్రీ పూర్తయిన వెంటనే లక్ష్యాలు నిర్ణయించుకుని, నిరంతరం లక్ష్యసాధనకు కృషిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. తన తండ్రి  హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేసి రిటైరయ్యారన్నారు. తన తల్లి కృష్ణవేణి, తండ్రి సన్యాసప్పడు తన విజయ సాధనకు ఎంతో కృషి చేశారన్నారు. తాను బీటెక్ అయ్యాక కొంతకాలం ప్రైవేటు ఉద్యోగాలు చేశానని, 2007లో గ్రూప్-2 పాస్ అయి తమ జిల్లాలోనే ఏసీటీవోగా పనిచేశానని చెప్పారు. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో 2013లో యూపీఎస్‌సీ పరీక్షలు రాసి 411 వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్‌కు ఎంపికైనట్టు వివరించారు. తెలుగు సాహిత్యం, జాగ్రఫీ ప్రధాన సబ్జెక్టులుగా తెలుగు మీడియంలో పరీక్షలు రాసి ఐఏఎస్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.
 
 స్వగ్రామం : విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం ధర్మవరం.
 తల్లిదండ్రులు : కృష్ణవేణి, సన్యాసప్పడు.
 
 భార్య : డోల లక్ష్మి, ఎంపీడీవో, పూసపాటిరేగ మండలం, విజయనగరం జిల్లా
 విద్యాభ్యాసం : 10వతరగతి వరకు ధర్మవరం జెడ్పీ హైస్కూలు, ఇంటర్మీడియెట్ విశాఖపట్నం వికాస్ జూనియర్ కాలేజీ, బీటెక్ నిట్, సూరత్‌కల్,కర్నాటక
 
 ఉద్యోగాలు : గ్రూప్-2లో ఉత్తీర్ణుడై 2007 నుంచి 2013 వరకు విజయనగరం జిల్లాలో ఏసీటీవోగా విధులు,2013 సివిల్స్‌లో 411వ ర్యాంకు. ఏపీ కేడర్ ఐఏఎస్‌కు ఎంపిక.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement