సముద్రం అల్లకల్లోలం - జలదిగ్బంధంలో విద్యుత్ కేంద్రం
విశాఖపట్నం: విజయనగరం జిల్లా బోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. విశాఖ తీరంలో సముద్రం 10 మీటర్ల మేర ముందుకొచ్చింది. అలలు సముద్రంలో ఎగిసి పడుతున్నాయి. సీలేరు జల విద్యుత్ కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు విద్యుత్ కేందంలోకి భారీగా వచ్చి చేరింది. నీటిని బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలల తాకిడికి భీమిలి మండలం మంగమారితోటలో ఇల్లు కూలాయి. ప్రజలు, పర్యాటకులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోగాపురం మండల చేపలకంచేరు గ్రామానికి చెందిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎల్లయ్య అనే మత్స్యకారుడు విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.