టీడీపీలో సీన్ రివర్స్ | Sean Rivers in TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో సీన్ రివర్స్

Published Wed, Jun 18 2014 1:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

టీడీపీలో సీన్ రివర్స్ - Sakshi

టీడీపీలో సీన్ రివర్స్

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : భాష, యాస, శైలితో జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అనంతరం తెర పైకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్‌నాయుడును చూసి అంతా వారసుడొచ్చాడనుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ఆదరించారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలిపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరి ణామాలు మాత్రం అసలు వారసుడి వన్నె తగ్గిస్తున్నాయి. ఎర్రన్న కుటుంబ సభ్యులన్న సానుభూతితో ఎంపీగా రామ్మోహన్, టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గెలిచారు. ఎన్నికల వరకు టీడీపీ వ్యవహారమంతా రామ్మోహన్ కేంద్రంగానే సాగింది. ఆయనే తమ గెలుపు చుక్కాని అని మెజారిటీ అభ్యర్థులు, పార్టీ నాయకులు భావించారు. ఎన్నికల్లో విజయం సాధించి అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఎన్నికల వరకు ఉన్న సీన్ కాస్త రివర్స్ అయ్యింది. అధికార కేంద్రం అబ్బాయ్ నుంచి బాబాయ్‌కి బదిలీ అయినట్లు కనిపిస్తోంది. అధికారుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు సహజంగానే మంత్రి అచ్చెన్న చుట్టూ కేంద్రీకృతమవుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి.
 
 సమీక్షలో రామ్మోహన్ మౌనం
 జిల్లా అధికారులతో మూడు రోజుల క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో ఆద్యంతం అచ్చెన్న హవాయే కనిపించింది. ఎంపీగా రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరైనా మౌనంగా కూర్చుండిపోయారు. అచ్చెన్న ప్రభ వెలిగించేందుకు అంతా ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగింది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీలో ప్రమాణం చేయకముందే జిల్లా సమీక్ష నిర్వహించడం.. సమీక్ష నిర్వహణ తేదీలు మారడం వెనుక కూడా అచ్చెన్న వ్యూహం ఉందని పార్టీకి చెందిన కొందరు పేర్కొంటున్నారు. సమావేశంలో కూడా ఒక వర్గాన్నే టార్గెట్ చేసుకుని మంత్రి మాట్లాడటం కూడా అనుమానాలు రేపుతోంది. తన ప్రసంగాల ద్వారా జాతీయ స్థాయి నాయకుల్ని ఆకట్టుకున్న రామ్మోహన్ ఈ సమావేశంలో మాత్రం మౌనం దాల్చడం, ఓ ఎంపీగా జిల్లా వాసులకు తాను ఏం చేయదలచుకున్నానో సమీక్ష సమావేశంలో అధికారులకు చెప్పకపోవడంపై టీడీపీలోని ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది.
 
 గ్రీవెన్స్‌లోనూ అదే తీరు
 సహజంగా అధికారులు మంత్రికే ప్రాధాన్యం ఇస్తారు కదా అని సరిపెట్టుకుందామంటే.. ఈ నేతల ఇళ్ల వద్ద నిర్వహిస్తున్న రోజువారీ గ్రీవెన్సులోనూ అదే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీని పెద్దగా పట్టించుకోకుండా అందరూ అచ్చెన్న చెంతకు చేరుతుండటం చర్చనీయాంశమవుతోంది. పదేళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడం, త్వరలో నామినేటెడ్ సహా అనేక పదవులకు నియామకాలు జరగనున్న నేపథ్యంలో మంత్రిని మచ్చిక చేసుకుంటేనే పదవులు లభిస్తాయని భావిస్తున్న వారు ఆయన్ను కలిసి విన్నపాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై అచ్చెన్న జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పనులకు సంబంధించి కూడా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్న వ్యవహార శైలి తెలిసిన తన వారంతా తనను వదిలి ఆయన చుట్టూ తిరుగుతుండడం అబ్బాయ్ రామ్మోహన్‌కు ఇబ్బంది కలిగిస్తోందని ప్రచారం జరుగుతోంది.
 
 జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి
 ఇక జిల్లా కేంద్రంలో పార్టీ క్యాడర్ గతంలో రెండు వర్గాలుగా ఉండేంది. ఇప్పుడు అందరూ అచ్చెన్న వద్దకు క్యూ కడుతున్నారు. అటు ఎంపీ వద్దకు గానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే వద్దకు గానీ ఎవరూ వెళ్లకపోవడం గమనార్హం. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టు విచారణలో ఉన్నందున నిలిచిపోయిన శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా సంబంధిత మున్సిపాలిటీ ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే.. ఆ ఎమ్మెల్యే, ఎంపీలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తారు. అందుకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎంపీ, ఎమ్మెల్యేలను మంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారు కూడా మిగతా ప్రయత్నాలను పక్కన పెట్టి ప్రాపకం కోసం ఆరాటపడు  తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement