డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాయం, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశానికి మొదటి సారిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పీజీ సెట్–2018 నిర్వహిస్తున్నారు. 2008లో ఈ వర్సిటీ ఏర్పడినప్పటికీ పీజీ ప్రవేశాల కోసం విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ ద్వారా పీజీ సెట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి సొంత సెట్ ద్వారా ప్రవేశాలు నిర్వహించాలని బీఆర్‌ఏయూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల బీఆర్‌ఏయూ పీజీ సెట్–2018 నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులు, కళాశాలల్లో ఉన్న సీట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో 17 కోర్సులు ఉన్నాయి. వర్సిటీ క్యాంపస్‌లో 16 కోర్సుల్లో 530 సీట్లు ఉన్నాయి. వర్సిటీ పీజీ అనుబంధ కళాశాలు 8 ఉన్నాయి. ఆదిత్య, గాయత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు, మహిళలు, ఎస్‌ఎస్‌ఆర్, సన్, రంగముద్రి ఎంఎడ్, బీఎస్‌జేఆర్ ఎంఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 531 సీట్లు ఉన్నాయి. వర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలల్లో మొత్తం 1061 సీట్లు ఉన్నాయి. అయితే డబ్బులు చెల్లించిన దరఖాస్తులు 360 మాత్రమే వచ్చాయి. 1350 వరకు రదఖాస్తులు చేసుకున్నా ఫీజులు మాత్రం అందరూ చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షలు రాయడానికి అర్హత సాధిస్తారు.
స్పందన లేక గడువు పొడిగింపు
బీఆర్‌ఏయూ పీజీ సెట్–2018 కోసం ఈ ఏడాది మార్చి 7వ తేదీ నుంచి ఈ నెల 6 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే అనుకున్న స్థాయిలో స్పందన లేకపోవటంతో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు గడువు పెంచారు. గడువు పెంచినా దరఖాస్తుల సంఖ్య పెరుగు తుందా? లేదా? అన్నది చూడవల్సి ఉంది. 8 విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, గణితం, కెమికల్ సైన్సెస్, జియోలజీ, హుమానీ అండ్ సోషల్ సైన్సెస్, ఇంగ్లిష్, తెలుగు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా, సీట్లుకు తగ్గ రీతిలో కెమికల్ సైన్సెస్, గణితంకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. హుమానీటీస్ అండ్ సోషల్ సైన్స్‌లో ఎంకాం, ఎకనామిక్స్, రూరల్ డెవలప్‌మెంట్, సోషల్ వర్కు, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంజేఎంసీ సబ్జెక్టుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సబ్జెక్టులకు కనీస దరఖాస్తులు రాలేవు. మరో పక్క జిల్లాలో వర్సిటీ, రెండు ప్రైవేట్ కళాశాలల్లో ఎంఎడ్ కోర్సుల్లో 120 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల్లో గత ఏడాది కనీస ప్రవేశాలు జరగలేదు. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంది. అలాగే వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో ప్రస్తుతం ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం, ఎననాటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మాత్రమే ప్రవేశాలు మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్సిటీలో పూర్తిస్థాయి రెగ్యులర్ బోధన సిబ్బంది ఉన్న బయోటెక్నాలజీ, సోషల్ వర్కు కోర్సులకు గత కొంతకాలంగా స్పందన అంతంత మాత్రంగా ఉంది.
సెట్‌పై ఆసక్తి కనబర్చని విద్యార్థులు
గతంలో ఆంధ్రాయూనివర్సిటీ సెట్(ఆసెట్) ద్వారా బీఆర్‌ఏయూ, దీని అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేవారు. ప్రవేశాలు జరగని కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేవారు. ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వ రాయితీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు మంజూరు కావటం లేదు. దీంతో స్పాట్ అడ్మిషన్లు కంటే సెట్‌లకు దరఖాస్తు చేసుకోవటం మంచిది. విద్యార్థులు మాత్రం సెట్ పట్ల ఆసక్తి కనపర్చటం లేదు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసెట్ రాసేందుకు ఇచ్చే ప్రాధాన్యం బీఆర్‌ఏయా సెట్ రాచేందుకు ఇవ్వటం లేదు. మరో పక్క పీజీలు చదివటం వల్ల సమయం వృథాగా చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలకు చదవటం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సెట్ కంటే డిగ్రీ మార్కులు ఆధారంగా పీజీల్లో ప్రవేశాలు కల్పించటం మంచిదని కొందరి అభిప్రాయం. ఇదిలావుండగా బీఆర్‌ఏయూ సెట్ పరీక్షలు మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ తేదీలు సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దరఖాస్తులు పెరుగుతాయి
బీఆర్‌ఏయూ సెట్–2018కు దరఖాస్తుల గడువు ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించాం. జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది విద్యార్థులు ప్రవేశ రుసుం చెల్లించకుండా దరఖాస్తులు చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే సెట్ హాల్ టిక్కెట్ మంజూరవుతుంది. విద్యార్థులు సెట్ ద్వారా ప్రవేశాలు పొందితే ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు మంజూరుకు అవకాశం ఉంటుంది.
– ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, సెట్ కన్వీనర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల
Comments
Please login to add a commentAdd a comment