మొదటి భార్య కొడుకుని భర్త ప్రేమగా చూస్తున్నాడనే అసూయే కారణం
వెంకటాచలం: మొదటి భార్య బిడ్డను భర్త తన బిడ్డపై కంటే ప్రేమగా చూస్తున్నాడన్న అసూయతో అభం శుభం తెలియని మూడేళ్ల బాబును కడతేర్చింది ఓ మానవత్వం లేని తల్లి. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఏడుకొండలుకి నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డుకు చెందిన మల్లి శ్రీనివాసులు కుమార్తె అనితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. ఏడుకొండలు గూడూరు ఎస్‌బీక్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అక్కడే పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన గౌరీ అనే యువతితో పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నాడు. ఈమెను నెల్లూరు ఆటోనగర్ వర్క్‌ర్స్ కాలనీలో కాపురం పెట్టాడు. పెళ్లయిన ఏడాదికి వీరికి శరణ్య అనే పాప పుట్టింది. ఈ పెళ్లి విషయాన్ని ఏడుకొండలు మొదటి భార్య వద్ద దాచాడు. కొద్ది నెలలకు మొదటి భార్యకు సాయితేజ(3) పుట్టాడు. ఈ క్రమంలో బాబుపై ఏడుకొండలు ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని గౌరీ అసూయ పడసాగింది. ఈ ఏడాది జూన్‌లో మొదటి భార్య ఆడపిల్లకు జన్మనిచ్చి..కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకునేందుకు నెల్లూరు ఆస్పత్రిలో చేరింది.
దీంతో ఏడుకొండలు సాయితేజని తీసుకుని జూన్ 11న రెండో భార్య ఇంటికి వచ్చాడు. అనంతరం పనిపై ఇంటి నుంచి బయటికెళ్లగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గౌరీ.. సాయితేజ (2)ను ముక్కు, నోరు మూసి హతమార్చింది. ఈ విషయాలను పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడయ్యాయి. చంటి బిడ్డను హతమార్చినందుకు గౌరీని, రెండో వివాహాన్ని దాచినందుకు ఏడుకొండలును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ వెంట ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోమ్ గార్డు సుచరిత ఉన్నారు.
చిన్నారిని కడతేర్చిన రెండో భార్య
Published Thu, Jul 2 2015 8:33 AM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM
Advertisement
Advertisement