పోలీసు కార్యాలయం
సాక్షి, అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో భారీగా బదిలీలకు రంగం సిద్ధమైంది. కొన్ని సంవత్సరాలుగా పోలీసుశాఖలో బదిలీలు లేకపోవడం, ఎన్నికల విధుల నిమిత్తం ఇతర జిల్లాల అధికారులు బదిలీపై రావడం తదితర కారణాల రీత్యా బదిలీల ప్రక్రియ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీల వరకూ బదిలీలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో మూడు సంవత్సరాల పాటు పనిచేస్తున్న వారు, జిల్లాకు చెందిన వారు, గత ఎన్నికల్లో జిల్లాలో పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలుదీరింది. జిల్లాకు నూతన ఎస్పీగా బూసారపు సత్యయేసుబాబు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నారు.
డీఎస్పీలతో మొదలై...
పోలీసుశాఖలో తొలుత డీఎస్పీలతో బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు, మూడు రోజుల్లో డీఎస్పీల బదిలీలు పూర్తి కానున్నాయి. ఎన్నికల నిమిత్తం కొంతమంది జిల్లాకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు. దీంతో తొలుత డీఎస్పీల బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
జిల్లాలో దాదాపు అన్నీ డీఎస్పీ స్థానాలకు కొత్త అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. అనంతరం బదిలీపై జిల్లాకు వచ్చిన సీఐలు తిరిగి వారి జిల్లాలకు వెళ్లనున్నారు. దీంతో జిల్లాకు చెందిన సీఐలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అనంతరం ఎస్‌ఐలు, ఆ తర్వాత కానిస్టేబుల్ బదిలీలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒకేస్థానంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతున్న పోలీసు సిబ్బందిని బదిలీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment