‘సిటీలైట్’ ఘటనలో మరో వ్యక్తి మృతి
Published Fri, Aug 30 2013 4:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
హైదరాబాద్, న్యూస్‌లైన్: నగరంలో తీవ్ర విషాదం నింపిన సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో మరో వ్యక్తి కన్నుమూశాడు. సుమారు 51 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. తాడ్‌బండ్‌కు చెందిన నర్సింగ్‌రావు (45) చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జూలై 8న జీహెచ్‌ఎంసీలో పనిచేసే తన స్నేహితుడు అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు బదులు విధుల్లోకి వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో ఈయన అక్కడే ఉండటంతో శిథిలాల్లో చిక్కుకపోయాడు. కొద్దిసేపటికి శిథిలాల్లో నుంచి బయటపడగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాలు తుంటి వద్ద విరగడంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అలాగే మెడపైన వెన్నుపూస దెబ్బతింది. ఎట్టకేలకు ఆరోగ్యం కుదుటపడడంతో పదిహేనురోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అప్పటినుంచి మంచంపైనే ఉన్న నర్సింగ్‌రావు గురువారం కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య,ఒక కూతురు ఉన్నారు. చిన్నతోకట్టలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Advertisement