భద్రతా వలయంలో షార్ | Security fence shar | Sakshi
Sakshi News home page

భద్రతా వలయంలో షార్

Published Wed, Jun 25 2014 2:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

భద్రతా వలయంలో షార్ - Sakshi

భద్రతా వలయంలో షార్

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్‌వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో శ్రీహరికోటలోని షార్‌లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే షార్ చుట్టూ స్థానిక పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు మోహరించాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఈ నెల 29వ తేదీ షార్‌కు రానున్న సంగతి తెలిసిందే. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన షార్‌కు చేరుకుంటారు.
 
 పధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు వీఐపీలు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు షార్‌లో మూడు హెలిపాడ్‌లు సిద్ధం చేస్తున్నారు. షార్‌కు చేరుకున్న ప్రధానిని మొదటి రోజు రాకెట్ లాంచింగ్ ప్యాడ్‌ను సందర్శించనున్నారు. 30వ తేదీ ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆయన 29వ తేదీ రాత్రి షార్‌లోని భాస్కర గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు.
 
 అడుగడుగునా నిఘా
 జిల్లాలోని తడ నుంచి కావలి వరకు ఉన్న 169 కిలోమీటర్ల తీరప్రాంతంలో మెరైన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. సోమవారం నుంచే పోలీసు బలగాలు షార్‌కు చేరుకుని, చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. షార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తోటకట్ట, అటకానితిప్ప, రాగన్న పట్టెడ, తిప్ప, కొన్నత్తూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.
 
 ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను అక్కడ నుంచి ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరు  ఈనెల 30వ తేదీ వరకు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు  వీలు లేదని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇప్పటికే షార్‌కు మెరైన్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు  చేరుకున్నాయి. వీరు కాకుండా తమిళనాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన పోలీసులను అదనంగా రప్పిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళం కూడా షార్‌కు రానుంది.
 
 నేడు ఎస్‌పీజీ ఐజీ రాక
 భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం ఢిల్లీ నుంచి ఎస్‌పీజీ ఐజి చతుర్వేది శ్రీహరికోటకు రానున్నారు. ఆయనతో పాటు అదనపు ఐజీలు సుధనుష్ సింగ్, సుమిత్ర రాయ్ మరో నలుగురు అధికారులు ఢిల్లీ నుంచి చెన్నై మీదుగా వస్తారని అధికారులు తెలిపారు.  ప్రధాని 30వ తేదీన ఉదయం 9.49 గంటలకు రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో 11 గంటలకు చెన్నైకి బయలుదేరుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ప్రధాని బయలుదేరేంత వరకు భద్రతా ఏర్పాట్లను ఐజీ చతుద్వేరి పర్యవేక్షించనున్నారు.
 
 బాబు కోరికను మన్నించని మోడీ
 ప్రధాని మోడీ చెన్నై మీదుగా కాకుండా రేణిగుంట విమానాశ్రయం మీదుగా శ్రీహరికోటకు చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరికను ప్రధాని మన్నించలేదని తెలిసింది.  రేణిగుంట నుంచి శ్రీహరికోట దగ్గరని, ఆంధ్రప్రదేశ్‌లోనే మోడీ విమానం దిగాలని కోరుతూ టెలిఫోన్‌లో సంభాషించిన విషయం తెలిసిందే. మొదట సరేనన్న మోడీ, తరువాత భద్రత దృష్ట్యా చెన్నై మీదుగానే శ్రీహరికోటకు చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 
 షార్‌లో హెలీప్యాడ్ల వద్ద బందోబస్తు
 షార్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు వేర్వేరుగా ఏర్పాటు చేసి హెలీప్యాడ్ల వద్ద మంగళవారం  బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం అదనంగా 20 మంది రిజర్వ్ పోలీసులను షార్‌కు పంపారు. ఈ 20 మందిని ఒక్కో హెలీప్యాడ్ వద్ద పదేసి మందిని ఏర్పాటు చేశామని ఎస్సై జీ గంగాధర్‌రావు చెప్పారు. ప్రధాని రాకతో షార్‌లో 50 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. షార్ అటవీప్రాంతాన్ని, సముద్ర తీరప్రాంతాన్ని, తీరప్రాంత గ్రామాల్లో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. షార్‌లోని సీఐ ఎస్‌ఎఫ్ సిబ్బందికి ప్రధాని పర్యటన పూర్తయ్యేదాకా సెలవులు ఇవ్వద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement