
బంద్ సంపూర్ణం
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ గురువారం సీమాంధ్ర బంద్ విజయవంతమైంది. ఏపీఎన్జీవోలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థల్ని మూయించారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్‌సీపీ నేతలు పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజమండ్రిలో విశాలాంధ్ర మహాసభ, ఏపీఎన్జీవోలు, న్యాయవాదులు విద్యార్థి సంఘాలు ఓఎన్‌జీసీ బేస్ కార్యాలయాన్ని మూసి వేయించారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో వైఎస్సార్ సీపీ నేతలు, ఎన్జీవోలు బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. విశాఖలో ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. విజయనగరంలో టీడీపీ నేతలు రైల్‌రోకో చేపట్టారు. విజయవాడలో ఎన్జీవో నేతలు బస్సుల ను అడ్డుకున్నారు. న్యాయవాదులు కోర్టుల మెయిన్‌గేట్‌కు తాళాలువేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దర్గామిట్టలోని ఎన్జీవో భవన్ నుంచి ఎన్జీవోలు భారీ నిరసన ప్రదర్శన తీశారు. ఒంగోలులో తెల్లవారుజామున ఆర్టీసీ డిపోవద్ద ఎన్జీవోలు, వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించి, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బంద్ విజయవంతం చేశాయి. వేకువ జాము నుంచే బస్సులను అడ్డుకున్నాయి. అనంతపురం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు మూతపడ్డాయి. ఆందోళనకారులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలతో పాటు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి బద్రీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడపలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విభజన బిల్లును దహనం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రైల్వేకోడూరులో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పులివెందులలో బైక్‌ర్యాలీ నిర్వహించి, దుకాణాలను మూయించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కర్నూలు-రాయిచూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టగా.. టీడీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆళ్లగడ్డలో బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, నగరి పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. నగరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కే.రోజా, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. తిరుమల బస్సులకు మినహాయింపు ఇచ్చారు.