సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు...నిరసనలు
హైదరాబాద్ :నిరంకుశంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించటంతో సీమాంధ్ర భగ్గుమంటోంది. సమైక్యవాదులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపటంతో బుధవారం సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
అనంతపురం : జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత మయ్యాయి. కర్నూలులోనూ బంద్ కొనసాగుతోంది. సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. 850 బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ నేత కాపు భారతి ఆధ్వర్యంలో బంద్, ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేపట్టారు.
వైఎస్ఆర్ జిల్లా : రాష్ట్ర అడ్డగోలు విభజినను నిరసిస్తూ వైఎస్సార్‌జిల్లాలో సమైక్యవాదులు రోడ్డెక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్‌పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెల్లవారుజామునుంచే ఆందోళనలు చేపట్టారు. కడపలో రోడ్లపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. కిరణ్, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందంటున్న సమైక్యవాదుల ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యవాదులంతా ఒక్కటై బంద్ నిర్వహిస్తున్నారు. బద్వేల్, పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో బంద్ జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమతం అయ్యాయి. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. మదనపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో చెన్నై-ముంబయి జాతీయ రహదారి దిగ్బంధం చేయటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
విజయనగరం : తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారంటూ సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. సోనియా, కాంగ్రెస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చీపురుపల్లిలో బంద్ జరుగుతోంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో సమైక్యఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యవాదులు రోడ్డెక్కారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతిఒక్కరూ రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. మూడు పార్టీలకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని సమైక్యవాదులు హెచ్చరించారు.
విశాఖ: విశాఖలోనూ ఉదయం నుంచే బంద్ కొనసాగుతోంది. విద్యా, వ్యాపార సంస్థల మూతపడ్డాయి. దాంతో నేడు ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవిభజనకు నిరసనగా అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ నేత కొణతాల లక్ష్మీనారాయణ, టౌన్ కన్వీనర్ జానీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుండటంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఉదయం నుంచే సమైక్యవాదులు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు ఆందోళనకు దిగటంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. జిల్లాలోని 500లకు పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది.
తూర్పుగోదావరి : రాష్ట్ర విభజనపై రాజమండ్రి మహిళలు కన్నీరు పెడుతున్నారు. మా తెలుగుతల్లి కన్ను మూసింది. మా మనసు క్షోభించిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ తన కుమారుడిని పీఎం చేసేందుకు రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు అన్ని విధాల సహకరించారంటూ విమర్శిస్తున్నారు. సమైక్యద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనపై కాకినాడ వాసులు మండిపడుతున్నారు. సీమాంధ్ర ప్రజల భవిష్యత్ అంథకారం చేసేందుకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రాహుల్, మోడిలు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ది చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు.
ప్రకాశం : అడ్డగోలుగా రాష్టాన్ని విభజించారంటూ ఒంగోలులో వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్‌ఆర్ సిపి అధినేత .జగన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. తెల్లావారుజామునే ఆర్టీసీ డిపోకు చేరుకున్న వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. డిపో ఎదుట బైటాయించి సోనియాగాంధీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు కుప్పం ప్రసాద్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కటారి శంకర్, సింగరాజు వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. పొదిలి ఆర్టీసీ డిపోలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు బస్సులను నిలిపివేశారు.
గుంటూరు:గుంటూరు జిల్లాలోనే బంద్ జరుగుతుంది. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత మర్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 107 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.