‘వైఎస్‌ జగన్‌ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చింది’ | YSRCP Protest To Support AgriGold Victims | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 3:10 PM | Last Updated on Thu, Jan 3 2019 6:09 PM

YSRCP Protest To Support AgriGold Victims - Sakshi

సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్‌ బాధితులు తరఫున వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పోరాడిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గురువారం అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా వైఎస్సార్‌ సీపీ ధర్నా చేపట్టింది. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా, బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్త నందిగం సురేష్‌లు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్‌ బాధితులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏ విధంగా కొట్టేయాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 260 మంది ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం 140 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో అని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే 1180 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బాధితులకు చివరి పైసా వచ్చేవరకు వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు కొట్టేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుని.. దొంగలను జైలుకు పంపుతామని హెచ్చరించారు.

ముస్తాఫా మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును టీడీపీ నాశనం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్న ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేకపోయిందని మండిపడ్డారు. బాధితులు ధైర్యంగా ఉండాలని.. వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

నందిగం సురేశ్‌ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే పరిస్థితిలో లేదన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా నిచ్చారు. వైఎస్సార్‌ సీపీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement