సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇప్పుడిప్పుడే వాస్తవ అంశాలు అవగతమవుతున్నాయి. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయడం ద్వారా విభజనను అడ్డుకోవచ్చని, రాష్ట్ర సమైక ్యతను కాపాడుకోగలుగుతామని వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న వాదన దారిలోకి వస్తున్నారు. విభజన బిల్లు రాష్ట్రానికి రాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని సోమవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదించాల్సిన అంశాలపై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీఎం క్యాంపుకార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాధ్, గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, శత్రుచర్ల విజయరామరాజు, కొండ్రు మురళితో సహ 16 మంది మంత్రులు, 33 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, హర్షకుమార్ పాల్గొన్నారు. సమైక్యతను కోరుతూ గతంలో చేసిన తీర్మానాన్నే పునరుద్ఘాటించి దాన్నే మంత్రుల బృందానికి పంపించాలని నిర్ణయించారు.
అధిష్టానం తీరును, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరిని సమావేశంలో న్యాయశాఖ మంత్రి ఎరాసు ప్రతాప్‌రెడ్డి, ఇతర నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీకి విభజన బిల్లు రాకముందే శాసనసభను సమవేశపరచి సమైక్య తీర్మానం చేయాలన్నారు. ఈపాటికే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చే సి ఉంటే కేంద్రం అంత త్వరగా ముందుకు వెళ్లే అవకాశం ఉండేది కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. మంత్రి కొండ్రు సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక దశలో ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసేంత పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం.