విభజించండి అని చెప్పింది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే : డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించడం మినహా మరో మార్గం లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అధినేత్రి సోనియాగాంధీకి చెప్పారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెల్లడించారు. తన సమక్షంలోనే వారు ఆ మాటలు చెప్పారని పేర్కొన్నారు. అయినా వారి పేర్లను తానిప్పుడు బయటపెట్టదల్చుకోలేదన్నారు. ఇప్పుడు ఆ నేతలు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భిన్నంగా మాట్లాడుతూ ఉండొచ్చని తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను శుక్రవారం మీడియా సమావేశంలో డీఎస్ కొట్టిపారేశారు. ‘‘మంత్రులు రాజీనామా చేశారా? అదంతా ఒట్టిమాట. ఎవరూ రాజీనామా చేయరండీ. వాళ్లు చేసింది తక్కువ.. మీడియాలో చూపుతోంది ఎక్కువ’’అని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాలని సీఎం చెబుతున్న మాటలను డీఎస్ తోసిపుచ్చారు. ‘‘తెలంగాణపై నిర్ణయమే జరగదని అన్నారు కదా! అలాగే కేబినెట్ నోట్ కూడా ఇప్పట్లో రాదన్నారు. ఏమైంది? వచ్చింది కదా.. కేంద్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రోడ్‌మ్యాప్ ప్రకారమే వెళుతోంది. నిజానికి అసెంబ్లీలో విభజన తీర్మానమే ఉండదు.
రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్ విభజన నోట్‌ను ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తరువాత రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం మాత్రమే కోరతారు. పార్టీల అభిప్రాయమా? వ్యక్తుల అభిప్రాయమా? అనేది వారి ఇష్టం. అంతే తప్ప ఓటింగ్ ఉండదు. ఒకవేళ ఒత్తిడి చేసి ఓటింగ్ తీసుకున్నా దానిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు’’ అని వివరించారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా సమైక్యవాదాన్ని పక్కనపెట్టి విభజనవల్ల తలెత్తే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. కేంద్రానికి విభజన ఎంత ముఖ్యమో సీమాంధ్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని, అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్యాకేజీతో ఆ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దానిలో సీమాంధ్రుల పాత్ర ఏమీ లేదని డీఎస్ చెప్పారు.