సాక్షి, హైదరాబాద్: విభజనపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమన్వయ కమిటీ పేరిట మరో కొత్త కహానీకి తెర తీశారు. అధిష్టానం విభజన ప్రక్రియపై వడివడిగా అడుగులు ముందుకేస్తుండగా దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సమైక్య ఉద్యమ కార్యాచరణ కోసమంటూ కొత్తగా ఒక కమిటీని తెరపైకి తెస్తున్నారు. విభజనకు రాష్ట్రంలోని ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలూ అంగీకరించారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు ప్రకటించగా.. రాష్ట్ర నేతలు సమైక్యం పేరిట ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు వేస్తున్నారన్న అనుమానాలు పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నా యి. సమైక్యవాద కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఈ కమిటీలోని నేతల జాబితాను బుధవారం విడుదల చేశారు.
మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కె.పార్థసారథి, టీజీ వెంకటేశ్, తోట నర్సింహం, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, బాలరాజు, అహ్మదుల్లా, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు అప్పల నర్సయ్య, కన్నబాబు, కాండ్రు కమల, కె.వి.నాగేశ్వరరావు, బీఎన్ విజయకుమార్, ఆనం వివేకానందరెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమన్వయకర్తగా మంత్రి శైలజానాథ్ వ్యవహరించనున్నారు. రాష్ట్ర విభజనపై రెండు నెలలకు పైగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నా, సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాల వుతూనే ఆందోళనలు సాగిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం వాటిని పట్టించుకోకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోతోంది. రాష్ట్ర పార్టీ నేతలు కూడా కనీసం సంఘీభావం తెలపకుండా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటిస్తూ వస్తున్నా రు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వెళ్తే సంక్షోభం తీవ్రమై రాష్ట్రంలో ప్రభుత్వం కూలితే విభజనపై కేంద్రం ముందుకెళ్లే దారుండదన్న ఉద్దేశంతో.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్తుత్తి రాజీనామాలతో ఇప్పటి వరకూ డ్రామాను నడిపించారు. రాజీనామాలు ఆమో దం పొందకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కనీసం సీమాంధ్ర ప్రజల్ని పలుకరించే పాపాన పోలేదు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తీవ్రాఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా విభజన ప్రక్రియకు సంబంధించిన నోట్‌ను ఆమోదించడంతోపాటు మంత్రుల కమిటీనీ కేంద్రం ఏర్పాటు చేసింది.
ఈ తరుణంలో రాష్ట్ర కాం గ్రెస్ నేతలు ఈ కమిటీని ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. కేం ద్రమంత్రుల కమిటీ రాష్ట్రానికి రానున్నట్లు వార్త లొస్తున్న తరుణంలో ఉద్యమకారుల నుంచి నిరసన లు మిన్నంటకుండా.. ఉద్యమాన్ని పక్కదారి పట్టించి కేంద్ర కమిటీ పనిని సుగమం చేసేందుకే రాష్ట్రంలో కమిటీని ఏర్పాటు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యం పేరిట ప్రజల్లోకి చొరబడి.. ఉద్యమకారులకు బదులు తామే ప్రతినిధులుగా కేంద్ర కమిటీ ముందుకు వెళ్లి.. విభజనకు సానుకూల వాతావరణం కల్పించడానికే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
పార్టీ ఢిల్లీ పెద్దల సూచనల మేరకే ఇది ఏర్పాటైనట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి వచ్చినప్పుడు.. ఈ కమిటీని సమైక్య ఉద్యమకారులు, సమైక్యవాద పార్టీలు వ్యతిరేకించే ఆస్కారముంటుందని భావిస్తున్న కేంద్రం పెద్దలు.. వ్యూహాత్మకంగానే ఈ సమన్వయ కమిటీకి తెరతీసినట్లుగా కనిపిస్తోంది. విభజన సాఫీగా సాగిపోయేలా అధిష్టానం పెద్దలు, రాష్ట్ర నేతలు కూడబలుక్కొని ఈ కమిటీని ముందుకు తెచ్చారని తెలుస్తోంది. 2 నెలలకుపైగా ఉద్యమం సాగుతున్నా అటుచూడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా ఉద్యమ కమిటీని ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశమిదేనని సీనియర్ నేతలు చెబుతున్నారు. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కార్యక్రమాల రూపకల్పన కోసం ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని శైలజానాథ్ మీడియాకు తెలిపారు. పీసీసీ చీఫ్ బొత్స సూచనల మేరకు దీన్ని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ రెండు రోజుల్లో సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందన్నారు.
కాంగ్రెస్ మరో కహానీ కమిటీ!
Published Thu, Oct 10 2013 3:18 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement