ఉద్యోగుల సమ్మె
ఉద్యోగుల సమ్మె
Published Thu, Feb 6 2014 2:02 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్జీవోలు గురువారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 10 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. రోజు వారీ విధులకు గైర్హాజరై కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎన్జీవో సంఘ కార్యాలయంలో జరిగిన సమైక్య ఉద్యోగ జేఏసీ సమావేశంలో ఈ మేరకు నాయకులు నిర్ణయం తీసుకున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ఎన్జీవో సంఘ నాయకులు సమ్మెబాట పట్టారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, వ్యవసాయ, ట్రెజరీ, వైద్య ఆరోగ్య, కమర్షియల్ ట్యాక్సు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్, ఫారెస్టు, కార్మిక, మహిళా సంక్షేమం విభాగాలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
విద్యుత్ జేఏసీ నాయకులు మాత్రం గురువారం ఎన్జీవోలు నిర్వహించే నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు ఇంకా ఏ విషయాన్నీ వెల్లడించలేదు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో సమైక్య ప్రదర్శన నిర్వహించి శుక్రవారం సమైక్య ఉద్యమాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఎన్జీవో సంఘ నేత రామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడు వెంకయ్య, మున్సిపల్ ఉద్యోగుల సంఘం నేత నమ్రతకుమార్, సర్వే విభాగం నేత లక్ష్మీనారాయణ, ఈశ్వరప్రసాద్ (ఆర్ అండ్ బీ), సత్యనారాయణ (ఎక్సైజ్), కోటేశ్వరరావు (సాంఘిక సంక్షేమశాఖ), మస్తాన్‌రావు (ఉమెన్ వెల్ఫేర్), రహమాన్ (వ్యవసాయ)తో పాటు నగర కమిటీ నేతలు దయానందరాజు, ప్రభాకరరావులు పాల్గొన్నారు.
Advertisement