సాక్షి, హైదరాబాద్ : వచ్చే నెల 7న హైదరాబాద్‌లో జరిగే సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య సభకు హైకోర్టు, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, ఏపీఏటీల సీమాంధ్ర న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించాలని తీర్మానించారు. గత వారం సీమాంధ్ర న్యాయవాదులు నిర్వహించిన సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదులు అడ్డుకొని, దాడులకు పాల్పడటాన్ని ఖండించారు.
గురువారం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులు గురువారం సమావేశమయ్యారు. సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కనకమేడల రవీంద్రకుమార్, కాసా జగన్మోహన్‌రెడ్డి, వై.నాగిరెడ్డి, ఎం.మనోహర్‌రెడ్డి తదితరులతో పాటు సుమారు 250 మంది లాయర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు.
భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సి.వి.మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీలో ఎవరెవరు ఉండాలో రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. హైదరాబాద్ అందరిదీ అని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరే హక్కు ఎవ్వరికీ లేదని సి.వి.మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అత్యంత హేయమైనదని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
సమైక్య సభకు సీమాంధ్ర లాయర్ల మద్దతు
Published Fri, Aug 30 2013 2:03 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement