
విభజనతో జలయుద్ధాలే
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి: ఢిల్లీ ధర్నాలో సీమాంధ్ర లాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగానే కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనవల్ల జల వివాదాలతో యుద్ధాలు వస్తాయని, విద్య, ఉద్యోగాలు, రెవెన్యూ, విద్యుత్, వనరుల పంపిణీలో సమస్యలు తలెత్తుతాయుని జేఏసీ పేర్కొంది. విభజనతో నీటి కొరత ఏర్పడి, సీమాంధ్రలోని డెల్టా ఎడారైపోతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో సీమాంధ్ర లాయర్ల జేఏసీ శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపింది. సీమాంధ్రలోని 13 జిల్లాల లాయర్లు ధర్నాలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు లాయర్లు శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.
జేఏసీ నేత సీవీ మోహన్‌రెడ్డి సహా పలువురు లాయర్లు ధర్నాలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలకు లేదన్నారు. 2014 ఎన్నికల వరకు విభజన ఆగేలా వారు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించినంత మాత్రాన సమైక్యాంధ్ర ఉద్యమం వెనక్కిపోదని, విజయం సాధించేవరకు ప్రజాఉద్యమం కొనసాగుతుందని అన్నారు. లాయర్ల జేఏసీ సమ్మె కొనసాగుతుందని, 26న విశాఖపట్నంలో సమావేశమై భవిష్యత్ కార్యచరణ వెల్లడిస్తామని చెప్పారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను, సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్‌ను కలిసి విభజననష్టాన్ని వివరించారు.