నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో భేటీ అయ్యారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రసంగించిన మోదీ డీమానిటైజేషన్ పై భారీ ఎత్తున తనకు లభించిన ఊహించని మద్దతు పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా పెద్దనోట్ల రద్దుకు మద్దతు అందించిన వారిందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. అవినీతినికి ప్రతిపక్షాలన్నీ మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించిందని విమర్శించారు.
అవినీతి, నల్లధనం నిర్మూలనలో పెద్ద నోట్ల రద్దు ఒక 'ముందడుగు' మాత్రమే అంతే కానీ ఇదే ముగింపు కాదని ప్రధాని కొత్తసంకేతాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయన్న హెచ్చరికలను అందించారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించేవారు కూడా డీమానిటైజేషన్ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి లభించిన సమైక్య మద్దతు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం విశేషం.
నల్లదనం, అవినీతిని అంతం చేసేందుకు అధికార పక్షం పోరాడుతుంటే, విపక్షాలు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యంకానీ పార్టీ ప్రయోజనాలు కాదని మోదీ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దేశం కన్నా పార్టీ ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చట్టాలు చేస్తారుకానీ అమలు చేయరని ఎద్దేవా చేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ నల్లధనం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు బోఫోర్స్, స్పెక్ట్రమ్ కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్ష ఎన్డీయే ఆందోళన చేసిందని, ఇప్పుడు..అవినీతిపై తాము పోరాడుతుంటే ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని వ్యాఖ్యానించారు. 1971లోనే పెద్ద నోట్లు రద్దుచేయాలి వాంచే కమిటీ కోరినా ఇందిరాగాంధీ పట్టించుకోలేదని మోదీ పేర్కొన్నారు. కానీ నల్లధనంపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోంటే అన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థతోనే దేశానికి భవిష్యత్తు అని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా నగదు రహిత లావాదేవీలను చేపట్టాలని ప్రధాని సూచించారు. ఈవిషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు.