
మీరంతా మాయగాళ్లు: న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యవాదులమని చెప్పుకుంటున్న మీరంతా మీ పదవులకు రాజీనామాలు ఎందుకు చేయలేదు.. ఇకనైనా ఊసరవెల్లి మాటలు కట్టిపెట్టండి.. మీరంతా మాయగాళ్లు... మిమ్మల్ని జనం నమ్మడం లేదు...’’ అంటూ పలువురు న్యాయవాదులు ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు, ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్‌బాబులపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ బుధవారం ఇందిరా పార్కువద్ద న్యాయవాదులు నిర్వహించిన మహాధర్నా ఇందుకు వేదికైంది. సభావేదిక వద్ద ‘గ్యోబాక్’ అంటూ పలువురు న్యాయవాదులు నినాదాలు చేస్తూ.. వారి ప్రసంగానికి అడ్డుతగిలారు. కొందరు న్యాయవాదులు ఈ నేతలకు మద్దతుగా మాట్లాడడంతో ధర్నా రసాభాసగా ముగిసింది.
అడ్వకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్‌సీవీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాలు నేతలు ధర్నాలో పాల్గొన్నారు. అక్కడేం జరిగిందంటే...
ఉండవల్లి, ఆశోక్‌బాబులపై గరంగరం
- నిలబడి ఆవేశంగా మాట్లాడే సమయం అయిపోయిందని, ఇప్పుడు కూర్చొని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఎంపీ ఉండవల్లి కూర్చొనే ప్రసంగించారు. అర్హతలేని టీ-బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం ధైర్యం చేయదన్నారు.
- ఈ సందర్భంగా ఓ న్యాయవాది లేచి... మీరెందుకు రాజీనామా చేయలేదని ఉండవల్లిని ప్రశ్నించారు. మరో న్యాయవాది లేచి ఊసరవెల్లి మాటలొద్దు... మీ మీద మాకు నమ్మకం లేదని విమర్శించారు.
- రాష్ట్ర విభజనను అడ్డుకుని ఉద్యమాలు, పోరాటాలు చేయడమనేది తమ బాధ్యత కాద ని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఇది కేవలం రాజకీయ అంశమని, ఇప్పటివరకూ గుర్రం పని గాడిద చేసిందని వ్యాఖ్యానించారు. మీరు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు, మీరు అమ్ముడుపోకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని న్యాయవాదులు అశోక్‌బాబుపై విరుచుకుపడ్డారు. జన విషయంలో చంద్రబాబు విధానమే కరెక్టనీ టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు చెప్పారు. దీంతో న్యాయవాదులు వారి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పార్టీ తరఫున ఒకే విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఎవరేమన్నారు...
మైసూరారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత: ఆనాటి పరిస్థితులను బట్టి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు ఆర్టికల్-3ని తీసుకొస్తే ఇప్పుడు కేంద్రం దానిని దుర్వినియోగం చేస్తోంది. అసెంబ్లీలో 77వ నిబంధన కింద ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు ఉంది. ఆ ప్రకారమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ అభిప్రాయం చెప్పడమంటే అది కూడా ఓటింగే అవుతుంది. డాక్టర్ మిత్రా, తెలుగు ప్రజా వేదిక ఉపాధ్యక్షుడు: సోనియా, చిదంబరం తదితర నేతలకు చట్టం, రాజ్యాంగం గురించి అవగాహన లేదు. ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేకుండా రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర విభజన చేస్తున్నారు.