* కేంద్రానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర ప్రభుత్వం
* కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఒక ఎన్‌ఐటీ ఏర్పాటుకు కూడా విజ్ఞప్తి
* నేడు ఎంహెచ్‌ఆర్‌డీతో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శుల కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి కేంద్ర విద్యా సంస్థలన్నింటినీ సీమాంధ్ర ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించనుంది. రాష్ట్రంలోని విద్యా సంబంధిత అంశాలపై కేంద్రం కోరిన అంశాలన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన నివేదికను శుక్రవారం అందజేయనుంది. ఈ మేరకు కీలక అంశాలపై చర్చించేందుకు శుక్రవారం కేంద్ర మానవ వనరుల శాఖ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ).. రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, మాధ్యమిక విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం కానుంది.
ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, మాధ్యమిక విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చినప్పుడు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం అనేక ఆందోళనలను వ్యక్తపరిచింది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి అనేక కేంద్ర ప్రాయోజిత విద్యాసంస్థలు రాజధాని కేంద్రంగానెలకొల్పారని, రాష్ట్ర విభజన జరిగే పక్షంలో తమ ప్రాంతానికి ఆ విద్యా సంస్థలు కరువుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
ముఖ్యంగా ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ తదితర కేంద్ర విద్యాసంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయని సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడేందుకు ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటు అదనంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ను కూడా ఏర్పాటు చేయడం సబబని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
1955 నుంచి సమాచార సేకరణ..
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో 1955 నుంచి ఉన్న విద్యా సంస్థలు, ఏటా వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యూనివర్సిటీల సంఖ్య.. ఇలా కేంద్రం కోరిన విద్యా సంబంధిత సమాచారం మొత్తాన్నీ రాష్ట్ర అధికారులు శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్‌డీకి ఇవ్వనున్నారు. దాంతోపాటు నివేదికలో ఇరుప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ కళాశాలల వివరాలనూ పొందుపరిచారు. అయితే, పాఠశాల, కళాశాల విద్య వరకు ఇరు ప్రాంతాల్లో ఉన్న సంస్థలు అక్కడి విద్యార్థుల అవసరాలను తీర్చే సంఖ్యలో ఉన్నప్పటికీ ఉన్నత విద్యాసంస్థలు, ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత సంస్థలు లేకపోవడాన్ని విద్యాశాఖ గుర్తించింది. ఇదే అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనుంది.
ఒకే ఇంటర్ బోర్డు, ఒకే కౌన్సిల్..
రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన ప్పటికీ సీమాంధ్రలో రాజధాని ఏర్పడేవరకు ఒకే ఇంటర్మీడియట్ బోర్డు, ఒకే ఉన్నత విద్యామండలి, ఒకే ఏపీపీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల రిజర్వేషన్లకు లోబడి అవి అడ్మిషన్లు, ఉద్యోగాలు భర్తీ వంటివి చేపడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్వహించినప్పటికీ.. బాధ్యతలను మాత్రం ఒకే సంస్థ నిర్వహిస్తుందని తెలిపాయి. ఇలాంటి క్లిష్టమైన అంశాలన్నింటిపైనా నేడు కేంద్ర మానవ వనరుల శాఖ మన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించనుంది. బిల్లులో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించేందుకు వీలుగా.. స్పష్టత కోసమే కేంద్రం ఈ భేటీ ఏర్పాటుచేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం
Published Fri, Nov 1 2013 1:25 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement