
సీమాంధ్ర మంత్రులు సోనియా తొత్తులు
సాక్షి, హైదరాబాద్: ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు నడుం బిగించినా అడ్డుకోవటంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, నేతలు దారుణంగా విఫలమయ్యారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం విమర్శించింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత మంత్రులు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి తొత్తులుగా మారి నోరెత్తటం లేదని ఆరోపించారు. శనివారం ఫోరం ఆధ్వర్యంలో సచివాలయంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ, సాధారణ ప్రజలు పార్లమెంటుకు వెళ్లి అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం లేనందున వారి పక్షాన మాట్లాడాల్సిన సీమాంధ్ర ప్రాంత నేతలు నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాకు జడిసి వారు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు రాసిన ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు బెలూన్లను గాలిలోకి వదిలారు. తమ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు మాట్లాడనందున, బెలూన్ల ద్వారా వర్తమానం పంపే ప్రయత్నం చేశామన్నారు.
పోలీసులతో వాగ్వాదం
సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సచివాలయం ఎన్ బ్లాక్ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించిన ఉద్యోగులు సీఎం కార్యాలయం ఉన్న సీ బ్లాక్ వద్ద బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆ సమయంలో సీఎం కార్యాలయంలోనే ఉండటంతో పోలీసులు వారిని అడ్డగించారు. డి బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్ వద్దకు రాగానే ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు, బెలూన్లను అక్కడే వదిలి పెడితేనే సీఎం కార్యాలయం వైపు ర్యాలీకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ఫోరం ప్రతినిధులు కాసేపు వాగ్వాదానికి దిగారు. మూడు రోజుల క్రితం తెలంగాణ ఉద్యోగులు సీఎం కార్యాలయం ముందు పావురాలు వదిలితే అడ్డుచెప్పని పోలీసులు తమను అడ్డుకోవటం వివక్షేనంటూ నినాదాలు చేశారు. అయినా పోలీసులు ససేమిరా అనడంతో అక్కడే బెలూన్లను వదిలి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు.
రాజధానిలో సమైక్య సభ జరిపి తీరుతాం: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 7న ఎల్బీ స్టేడియంలో సమైక్య సభ జరిపి తీరుతామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో కార్యాలయంలో శనివారం జరిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ఉంటే సమైక్య సభకు ఆటంకాలు సృష్టించరని, నిజాయితీ లేకే శాంతి ర్యాలీలు, మిలియన్ మార్చ్‌లు చేపడుతున్నారని ధ్వజమెత్తారు.
తాము సభను గాంధేయ పద్ధతుల్లో శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర రాజధానిలో సభలు, సమావేశాలు నిర్వహించుకొనే హక్కు తమకుందన్నారు. సభకు అనుమతి లభించకుంటే.. కోర్టుకు వెళ్లి తెచ్చుకుంటామని చెప్పారు. విభజన వల్ల ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నదీ జలాలపై స్పష్టత లేదన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఏం కావాలనే విషయంలో స్పష్టత కొరవడిందన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవోలు, ఐటీ ఉద్యోగులతో పాటు ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.