ఈ ఎత్తు చిత్తు!
Published Wed, Feb 12 2014 1:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి మరో హైడ్రామాకు తెరలేపింది. జిల్లా నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంఎం పళ్లంరాజు, రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ విభజన ఉద్యమం మొదటి దశలో ముఖం చాటేశారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఇద్దరు ఎంపీలు అరుణ్‌కుమార్, హర్షకుమార్‌లను పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినందుకు పార్టీ అధిష్టానం మంగళవారం సస్పెండ్ చేసింది. పార్టీ ధిక్కారానికి పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది.
రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఎంపీల సస్పెన్షన్ డ్రామాకు తెరతీసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే ఏమో వీరి సస్పెన్షన్‌పై జిల్లా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం కాలేదు. ఎవరూ పట్టించుకోలేదు.సమైక్యాంధ్రను రెండు ముక్కలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ నిర్ణయానికి నిరసనగా రాజమండ్రి, అమలాపురంలలో వారి మద్దతుదారులు అక్కడక్కడ రాజీనామాలు చేశారు. పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమవుతుందని భావించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఎంపీల సస్పెన్షన్‌ను సాకుగా తీసుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
అమలాపురంలో నియోజకవర్గ నాయకులు సమావేశమై ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయంపై వారి అనుచరగణం మాత్రమే స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోటరీలో మంచి పట్టున్న పళ్లంరాజు, మేధావి వర్గానికి చెందిన నాయకునిగా పేర్కొనే ఉండవల్లి, చమురు సంస్థలపై చేపట్టిన ప్రజాందోళనల్లో కొంతలో కొంతైనా భాగస్వాములు కాలేకపోయిన మరో ఎంపీ హర్షకుమార్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జిల్లాలో ప్రజలు పెద్దగా స్పందించ లేదు. పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆ ఇద్దరు ఎంపీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామని భావించారు.
అరుణ్‌కుమార్ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో విభజన పరిణామాలు వివరించేందుకా అన్నట్టుగా ఏర్పాటు చేసిన సభలకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సహా ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరుకావడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రెండు పర్యాయాలు ఉండవల్లి సమావేశాలు పెట్టినా ప్రజలు మాత్రం సమైక్యాంధ్ర పై ఆయన చిత్తశుద్ధిని శంకించారనే చెప్పాలి. మరో ఎంపీ హర్షకుమార్ కూడా విభజన నిర్ణయంపై వివిధ సందర్భాల్లో భిన్నమైన వాదనలతో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి ముందు వరుస ధర్నాలు చేసి జేఎన్‌టియూకే కాలేజీ ఎదుట హోర్డింగ్‌లతో విద్యార్థిలోకం నిరసనను తెలియచేసింది. అమలాపురం, రాజమండ్రి ఎంపీల దిష్టిబొమ్మలను ఉద్యమకారులు దహనం చేశారు. వారు పలుచోట్ల నిరసనలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎంపీ హర్షకుమార్ అయితే విభజన ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అన్న దాఖలాలు కూడా లేవు.
రాష్ట్ర విభజన చేసి తెలంగాణ ఇచ్చేయడమే మేలంటూ ప్రకటనలు చేసిన హర్షకుమార్ ప్రజా వ్యతిరేకతతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలంటూ ఆనక ప్లేటు ఫిరాయించారు. ఇద్దరు ఎంపీలు ప్రజాగ్రహాన్ని ముందుగానే పసిగట్టారేమో తెలియదు కానీ, గత నెల మొదటివారంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాదరణను తిరిగి పొందవచ్చునని ఆశించారు. అవిశ్వాస అస్త్రం ద్వారా అంతవరకు తమపై ఉన్న వ్యతిరేకతను సమైక్య ముసుగులో అధిగమించాలనుకున్న ఎంపీల ఎత్తుగడ పారలేదు. విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఒకరకంగాను ప్రజాగ్రహం పెల్లుబికినప్పుడు మరోరకంగాను వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు. ఇద్దరు ఎంపీలను ప్రజల్లో హీరోలను చేసే ఉద్దేశంతోనే అధిష్టానం సస్పెన్షన్ నాటకానికి తెరతీసినా ప్రజల్లో మాత్రం ఆశించిన స్పందన కానరాలేదు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రజా విశ్వాసం పొందాలనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశాక ఇద్దరు ఎంపీలకు అదనంగా ఒరిగిందేమీ లేదు.
కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంపై జిల్లా నుంచి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు సహా ఇద్దరు ఎంపీల స్పందన ఆది నుంచి మొక్కుబడిగా, సందేహాస్పదంగానే కన్పించింది. ప్రజాందోళన నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఓటేయమన్నా వేయరనే వాస్తవాన్ని ముందుగానే గమనించే ఉండవల్లి ఆ నిర్ణయం తీసుకున్నా ప్రజల నుంచి సానుభూతి మాత్రం అప్పుడు, ఇప్పుడు కూడా పొందలేకపోయారు. ఆ ఇద్దరు ఎంపీలు సమైక్యాంధ్రకు మద్ధతుగా చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం చేసి ఉంటే ఈ రోజు సస్పెండ్ అయినప్పుడు జిల్లా ప్రజల నుంచి ఆదరణ లభించి ఉండేదని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించే నాయకుల పట్ల వారి స్పందన ఎలా ఉంటుందనేది ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.
త్వరలో భవిష్యత్‌పై నిర్ణయం
తీసుకుంటాం
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాం. కానీ అధిష్టాన నిర్ణయం బాధ కలిగించింది. సస్పెండ్ అయిన
మా ఆరుగురం త్వరలో భవిష్యత్‌పై
నిర్ణయం తీసుకుంటాం.
- ఉండవల్లి అరుణ్‌కుమార్, రాజమండ్రి ఎంపీ
తప్పేంటో అర్థం కావడం లేదు
ఇది అన్యాయం. ప్రజల కోసం తీర్మానానికి అనుకూలంగా సంతకం చేశాం. మేం చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాం. భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారు.
- జి.వి.హర్షకుమార్, అమలాపురం ఎంపీ
Advertisement
Advertisement