సాక్షి నెట్‌వర్క్: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య సెగ తగిలింది. జెడ్పీ సెంటర్‌లో 152 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు శుక్రవారం సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆయనను చూసిన న్యాయవాదులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ‘గోబ్యాక్ పళ్లంరాజు’ అంటూ నినాదాలు చేస్తూ ఘెరావ్ చేశారు. ‘మీ చేతకాని తనంవల్లే ఈ పరిస్థితి వచ్చింది. మీరంతా రాజీనామా చేసి ఉంటే విభజన బిల్లువచ్చి ఉండేది కాదు’ అంటూ న్యాయవాదులు మండిపడ్డారు.
సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా చూస్తానంటూ మంత్రి నచ్చజెప్పబోయినా శాంతించలేదు. రాజీనామా చేసే వరకు ఇక్కడకు రావొద్దంటూ నినదించడంతో పళ్లంరాజు వెనుదిరిగారు. కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో బంద్‌ను పర్యవేక్షిస్తున్న టీడీపీ శ్రేణులూ తమకు ఎదురుపడిన పళ్లంరాజు కాన్వాయ్‌ను అడ్డుకున్నాయి.