మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇక రుణాలు అందడం గగనమే..ఓవైపు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడం.. మరోవైపు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తున్న ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నిలిపేసింది. ఆర్థికంగా వెనకబడిన షెడ్యూల్డు కులాల(ఎస్సీ)కు చెందిన వారిని ఆదుకునేందుకు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన అర్హులకు రుణాలు మంజూరుచేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే జిల్లాకు 3975 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించారు.
రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని, యూనిట్లు నెలకొల్పేందుకు సబ్సిడీ మంజూరు చేయాలని ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్‌లో దరఖాస్తులు చేసుకున్నా ఒక్క యూనిట్‌కు కూడా మంజూరుచేయలేదు. కాగా, యూనిట్లను మంజూరు చేయొద్దంటూ ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు ప్రతిరోజూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోతున్నారు. అధికారులు కూడా నిస్పహాయస్థితిలో ఉన్నారు.
రుణం పొందేవారు
ముఖ్యంగా నిరుద్యోగులు చిన్న చిన్న పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలు, పాడి ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకం, భూమి కొనుగోలు, బోరు, గొట్టపు బావులు, విద్యుత్ మోటార్లు, పైపులైన్, విద్యుదీకరణ, చర్మ వృత్తికారుల వ్యాపారాలు, సఫాయి కర్మ చారీల సహాయ కార్యక్రమాల కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా గుర్తించిన పాకీ పనివారు, వెట్టి చాకిరి విముక్తి పొందిన కార్మికులు, జోగిని స్త్రీల పునరావాసం, అత్యాచార బాధితుల ఆర్థిక సహాయం, విడుదలైన ఖైదీలు, లొంగిపోయిన తీవ్రవాదులు, చిన్న పిల్లలు ఉన్న వితంతువులు, వికలాంగులు కూడా వ్యక్తిగత రుణాలు పొందే అవకాశం ఉంది. ఒక యూనిట్‌ను ఏర్పాటుచేసుకునేందుకు లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
చేతులేత్తేసిన అధికారులు
బ్యాంకురుణ ం పొందిన లబ్ధిదారులకు వారు నెలకొల్పిన యూనిట్‌ను బ ట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మునిసిపల్ కమిషనర్, బ్యాంకు అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరిగినప్పటికీ ఒక్క యూనిట్ కూడా మంజూరు కాలేదు. కొత్తగా బోరుబావులు తవ్వుకున్న లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని నిధుల మంజూరు కోసం ఎస్సీ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు.
2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు బడ్జెట్ ఏవిధంగా ఇవ్వాలనే విషయమై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారని, తమ చేతుల్లో ఏమీలేదని లబ్ధిదారులకు స్థానిక అధికారులు చెప్పి పంపిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలవుతున్న దృష్ట్యా ఆ నిధుల మంజూరుపై కూడా ఇప్పటివరకు స్పష్టతలేదు. దీనికితోడు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మంజూరు కాకపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రుణం..గగనం
Published Wed, Aug 7 2013 4:24 AM | Last Updated on Tue, Jul 24 2018 2:17 PM
Advertisement