స్వార్థాన్ని విడనాడండి
- ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు
- భగవంతుడే సార్వభౌముడు
- ధ్యానం, జ్ఞానం, గానం అవసరం
- ఆధ్యాత్మిక గురువు రవిశంకర్
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ప్రజలు స్వార్థాన్ని (నేను, నా అనే భావనను) వదిలిపెట్టాలని ‘ద ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పేర్కొన్నారు. ఎస్వీయూ క్రీడామైదానంలో ఆదివారం రాత్రి దివ్య సత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. 15 నిమిషాల పాటు అందరిచేతా యోగా చేయించారు. జీవనమనే బండికి భక్తి, ధర్మమే ఇంధనాలని చెప్పారు. కష్టపడే వ్యక్తిలోనే దైవత్వం ఉంటుందన్నారు. భగవంతుడే సార్వభౌముడని, ఆయన అన్నిచోట్లా ఉన్నాడని చెప్పారు. ప్రపంచం అంటే పంచభూతాలని చెప్పారు.
గుడిలో హారతి, తీర్థం, ప్రసాదం, మంత్రోచ్ఛారణ, శఠగోపం రూపాల్లో పంచభూతాలు ఉన్నాయని చెప్పారు. మన పురాతన సంస్కృతి గొప్పదని, కొందరు ఇతర మతాల వైపు, ఇతర సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇది పెద్ద తప్పిదమని చెప్పారు. అజ్ఞానం వల్లే మతమార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని మతాలు సమానం అని, అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. శఠగోపం అంటే మనం దేవుడికి దాసోహం అవుతున్నామని అర్థమన్నారు. ప్రతి వ్యక్తీ చిన్నచిన్న వాటికి దాసోహం కాకుండా, అత్యున్నతులైన భగవంతునికి మాత్రమే దాసోహం కావాలని చెప్పారు.
మనం చేసే పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత ఉండాలన్నారు. మనది సంపన్నమైన రాష్ట్రం అని ఇంగ్లాండ్‌కు చెందిన మెకాలే చెప్పారని గుర్తు చేశారు. అయితే లంచగొండితనం వల్ల పేదరికం పెరిగిపోయిందన్నారు. ప్రతి డాక్టరూ ఏడాదిలో 3 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అలానే లాయర్లు ఏడాదిలో ముగ్గురికి ఉచిత న్యాయసలహా అందించాలని చెప్పారు. మన రాష్ట్రంలో వనరులకు కొదవ లేదని అయినప్పటికీ విదేశాల నుంచి అందే వనరులను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు.
రోజూ ధ్యానం చేయండి
ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. ధ్యానం వల్ల శరీరం సేద తీరి మనస్సు, ఆలోచనలు విశాలమౌతాయని చెప్పారు. తక్కువ కాలం సంతోషం ఎక్కువ కాలం బాధ ఉంటే అది చెడు అని, ఎక్కువ కాలం సంతోషం తక్కువ కాలం బాధ ఉంటే అది మంచి అని చెప్పారు. నేను అనే అహంకారం పోవాలంటే సహజంగా ప్రవర్తించాలని, ఒక రోజు పిచ్చివాడిలా వ్యవహరించాలని చెప్పారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛమైన మంచినీరు దొరకడం లేదన్నారు.
ఇందుకోసం తాము తక్కువ ఖర్చుతో వాటర్ ఫిల్టర్ అందజేస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రతి రోజూ 80 లీటర్లు శుద్ధి చేసుకోవచ్చన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపొందించిన తెలుగు తల్లి అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ఎస్వీయూ వీసీ రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా వాలెంటీర్ ఫర్ బెటర్ ఇండియా అనే సంస్థకు చెందిన విద్యార్థులు రవిశంకర్ అనుగ్రహ యాత్రకు సంబంధించిన నృత్యాన్ని ప్రదర్శించారు. అలానే కళాబృందాలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులను భక్త పారవశ్యంలో ముంచెత్తాయి.