వైద్య ఆరోగ్యశాఖలో ఆయనో సాధారణ సీనియర్ అసిస్టెంట్. కానీ కార్యాలయంలో ఆయన చెప్పిందే వేదం. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు దండుకోవడం మొదలు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల దాకా ఆయన అకృత్యాలు ఎన్నో. బాధితులు నేరుగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో సదరు అధికారి అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
అనంతపురం న్యూసిటీ: వైద్య ఆరోగ్యశాఖలో అక్రమార్కులకు అడ్డూ అదపు లేకుండా పోతోంది. ఇటీవల ఓ కీలక అధికారిపై అవినీతి ఆరోపణలు వెలుగు చూడగా...తాజాగా ఆరోగ్యశాఖలో ఓ సీనియర్ అసిస్టెంట్‌పై భారీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సాధారణ సీనియర్ అసిస్టెంట్ అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తడంపై ఆరోగ్యశాఖలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. ఉద్యోగ నియామకాల్లో జోక్యంతో పాటు అమ్మాయిల అవసరాన్ని ఆసరగాతీసుకుని లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడంతో సదరు అధికారి చాలా కాలంగా ఒకే సీటులో తిష్టవేసి వసూళ్లు పర్వం నడిపించాడు. సదరు అధికారి వ్యవహారాలపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిటీ వెల్ఫేర్‌కు కొందరు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నోటిఫికేషన్ పడితే పండగే
ఆరోగ్యశాఖలో ఏదైనా నోటిఫికేషన్ వెలువడితే సదరు సీనియర్ అసిస్టెంట్ వెంటనే రంగంలోకి దిగుతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ముందుగానే తెలుసుకుని వారికి ఫోన్ చేసి మీకు పక్కాగా జాబ్ ఇప్పిస్తామని ట్రాప్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ విధంగా వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల తీసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. 2010లో సెకెండ్ ఏఎన్‌ఎం ఉద్యోగాల భర్తీలో భారీగా సొమ్ము చేసుకున్నట్లు తెల్సింది. కొంతమందికి ఉద్యోగాలిప్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని తిప్పించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి.
లైంగిక ఆరోపణలెన్నో
♦ 2010–11లో ఆరోగ్యశాఖలో ఓ చిరు ఉద్యోగి జీవితంతో సదరు సీనియర్ అసిస్టెంట్ ఆడుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల పాటు లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోస్టు రెగ్యులర్ చేయిస్తానని చెప్పి ఓ కీలక అధికారి దగ్గరికి వెళ్లాలని చెప్పగా... సదరు ఉద్యోగి నిరాకరించి, తనకు ఆ పోస్టు అవసరం లేదని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉంటూ ఇంత నీచానికి ఒడిగడతావా అంటూ సదరు చిరు ఉద్యోగి తండ్రి సీనియర్ అసిస్టెంట్‌కు చీవాట్లు పెట్టినట్లు ఆరోగ్యశాఖలోని సిబ్బందే చర్చించుకుంటున్నారు.
♦ ఇక సెకెండ్ ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ ఇతని వికృత చేష్టలకు ఏకంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు ఫిర్యాద చేశారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆపార్టీ నేతల రాజకీయ అండదండలతో ఆ ఫిర్యాదులను తొక్కిపెట్టారు. ఇలాంటి కేసులు లెక్కలేనన్ని ఉన్నాయని ఆరోగ్యశాఖ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంధం చంద్రడు ఆరోగ్యశాఖలో అక్రమార్కులపై నిఘా ఉంచితో అవినీతిని అరికట్టడంతో పాటు మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.
సాధారణ ఉద్యోగి..రూ.కోట్లలో ఆస్తులు
♦ ఓ సాధారణ సీనియర్ అసిస్టెంట్ అక్రమార్జనకు అడ్డు లేకుండా పోయింది. డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన లేఖలో ఇతని అక్రమాస్తుల చిట్టాను ఇలా ఉంది.
♦ అనంతపురం నాయక్‌నగర్‌లో రూ.1.50 కోట్లతో 10 సెంట్లలో స్థలం కొనుగోలు.
♦ తన భార్య, బావమరది పేరిట జిల్లాలోని గోరంట్లలో 10 ఎకరాల స్థలం కొనుగోలు.
♦ బెంగళూరులో ఓ షాపు, నగరంలోని వినాయకనగర్‌లో రూ కోట్లు విలువ చేసే మూడు అంతస్తుల్లో భవనం.
♦ ఇలా మొత్తం రూ.25 కోట్ల వరకు ఈయన అక్రమార్జన ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment