సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రైం థ్రిల్లర్‌ను తలపించే రియల్ స్టోరీ ఇది. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ ఓ వ్యక్తి ఐదేళ్లలో 8 మందికి విషం కలిపిన ప్రసాదం తినిపించి హతమార్చిన వైనం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం అదిరిపడ్డారు. అతడు సాగించిన సీ‘రియల్’ హత్యలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. పూజల పేరిట మాయ చేసేవాడు. ఫలానా పూజ చేయిస్తే అపర కోటీశ్వరులు కావచ్చని, ఓ రకమైన నాణేన్ని దగ్గర ఉంచుకుంటే రాజకీయ పదవులు సైతం వరిస్తాయని నమ్మించేవాడు. పూజలు ఫలించక.. అతడిచ్చే నాణేలు పని చేయట్లేదని గుర్తించి నిలదీసిన వ్యక్తులకు ఈసారి పెద్ద గుడిలో పూజ చేయించానని చెప్పి ప్రసాదమిచ్చేవాడు. అందులో విషం కలపటంతో దాన్ని తిన్న వ్యక్తులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. సదరు కిల్లర్ కొందరు ధనవంతులకు మహిళలను ఎరవేసి డబ్బులు సైతం వసూలు చేసేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది.
మొదట బుకాయించినా..
నాగరాజు మరణంతో తనకెలాంటి సంబంధం లేదని సదరు కిల్లర్ బుకాయించగా.. చివరకు విషం కలిపిన ప్రసాదం తినిపించి నాగరాజు ప్రాణాలు తీసినట్లు అంగీకరించాడు. అతడి ఒంటిపై గల బంగారు ఆభరణాలు, డబ్బును తానే తీసుకున్నట్టు చెప్పాడు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా.. విస్మయకరమైన విషయాలను బయటపెట్టాడు. తాను చేసిన మోసం బయటపడిన సందర్భాల్లో సంబంధిత వ్యక్తులను పెద్ద ఆలయాలు, పెద్ద స్వాముల వద్ద పూజలు చేయించినట్లు నమ్మించి ప్రసాదంలో కలిపిన విషాన్ని తినిపించి హతమార్చిన విషయాలను బయటపెట్టాడు. తానిచ్చిన విషం తిన్న బాధితులు కొంతసేపటికే మరణించే వారని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు హార్ట్‌అటాక్‌తో చనిపోయినట్లు భావించేవారని కిల్లర్ చెప్పాడు. ఇలా ఏలూరులో ముగ్గురితోపాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 8 మందిని హతమార్చి నగదు, బంగారం దోచుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. మృతుల్లో ఐదుగురు సీరియల్ కిల్లర్ బంధువులేనని సమాచారం. కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ విచారణను ముమ్మరం చేశారు. నిందితుడు గతంలో చేసినట్లుగా చెబుతున్న హత్యల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులను కూడా ఛేదించిన తర్వాత నిందితుణ్ణి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
పీఈటీ హత్యతో వెలుగులోకి..
సీరియల్ కిల్లర్ అసలు స్వరూపం వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ) హత్యతో వెలుగు చూసింది. ఏలూరు అశోక్ నగర్‌లోని కేపీడీటీ పాఠశాల పీఈటీ కాటి నాగరాజు (49) ఈ నెల 16న వట్లూరులోని మేరీమాత ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతడు మరణించగా, గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. ఐతే, నాగరాజు వేరే వారికి ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.2 లక్షల నగదు, అతని ఒంటిపై గల నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో త్రీటౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపించగా.. విషం కలిసిన ఆహారం తినడం వల్ల మరణించినట్లు నివేదిక వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతునితో చివరగా ఫోన్ మాట్లాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటికొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment