అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండడం.. ఉద్యోగులు, అధికారులు ప్రజలతో కలసి ఉద్యమంలో మమేకం కావడంతో పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి.
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండడం.. ఉద్యోగులు, అధికారులు ప్రజలతో కలసి ఉద్యమంలో మమేకం కావడంతో పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్ చేపడుతున్న చర్యలు పెద్దగా సఫలం కావడం లేదు. ఉద్యమం నేపథ్యంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పచ్చిమిర్చి కిలో రూ.120, ఉల్లిగడ్డలు కిలో రూ.80 పలుకుతున్నాయి. ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన అధికారులు ఉల్లిగడ్డలను కిలో రూ.40లతో రైతు బజార్లో విక్రయించే ఏర్పాటు చేశారు. అయితే మిగిలిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించలేకపోతున్నారు. పాలనాపరమైన.. ప్రజాపరమైన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, జేసీ సత్యనారాయణ మాత్రమే విధుల్లో కొనసాగుతుండగా.. మిగిలిన గెజిటెడ్ ఉద్యోగులందరూ ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టారు. ఒక్కసారిగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో జిల్లాలో పాలన స్తంభించిపోయింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల జీతాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు సమ్మె నోటీసు అందజేశారు. అత్యవసర సేవలతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
ఆగిపోయిన రేషన్ పంపిణీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లాలో రేషన్ పంపిణీకి బ్రేక్ పడింది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 11వ తేదీలోపు అమ్మహస్తం పథకంలోని సరుకులతో పాటు బియ్యం కూడా కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే జులై 30వ తేదీ నుంచి జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎసిగిపడుతుండడంతో ఆగస్టు నెల రేషన్ పంపిణీ చేయలేదు. దీంతో కార్డుదారులు సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు.
రోడ్డెక్కని ఆర్టీసీ
సమైక్య ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు విధులకు స్వస్తి పలికి జులై 31వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లాలోని 12 డిపోలకు చెందిన దాదాపు 870 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రోజుకు రూ.75 లక్షలు చొప్పున ఆర్టీసీకి రూ.22.50 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే సమైక్య ఉద్యమం ప్రైవేటు వాహనదారుల పాలిట కల్పవృక్షంగా మారింది. ప్రయాణీకుల అవసరం వారికి వరంగా మారింది. వారిపై నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అందినంత దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కనీస ధర్మాన్ని కూడా ప్రైవేటు వాహనదారులు పాటించడం లేదనే విమర్శలున్నాయి. అనంతపురం నుంచి ఆర్టీసీ బస్సులో ముదిగుబ్బకు వెళ్లాలంటే రూ.40 ఉండగా.. ప్రైవేటు యజమానులు రూ.60 వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి ప్రతి రోజూ హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహన యజమానులు అందినకాటికి దోచుకుంటున్నారు. అనంతపురం నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్తే రూ.450 ఉండగా ప్రైవేటు యజమానులు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు కూడా పాల్గొంటుండడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
జిల్లాలో ఏడాదికి రూ.120 కోట్లు టార్గెట్ కాగా సమైక్య ఉద్యమం కారణంగా దాదాపు రూ.12 కోట్లు రిజిస్ట్రేషన్ శాఖకు నష్టం వాటిల్లింది. అలాగే వాణిజ్యపన్నుల శాఖ సిబ్బంది, అధికారులు సైతం ఉద్యమంలో ఉండడంతో ఆ శాఖ దాడులు నిలిచిపోయాయి. దీంతో దాదాపు రూ.25 కోట్లు ప్రభుత్వ ఖజానా కోల్పోయింది. మొత్తమ్మీద నెల రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.59.50 కోట్లు గండిపడింది.