శేషాచలం అడవుల్లో పోలీస్ ఫైర్
- రాళ్లతో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి
- ఆత్మరక్షణ కోసం పోలీసుల
- కాల్పులు నిందితుల పరార్
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న కూలీల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు అడవిలోకి వెళ్లిన పోలీసులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు తుపాకులకు పనిచెబుతున్నారు. రెండు రోజుల క్రితం శేషాచల అడవిలోని చామలరేంజ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది.
తాజాగా ఆదివారం శేషాచలం కొండల్లో గుడ్డెద్దుబండ, ఈతకుంట ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారని జిల్లా సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఇలియాస్‌బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు..
15 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం కల్యాణిడ్యాం సమీపంలోని శ్రీవారి పాదాలు ప్రాంత అడవిలోకి కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో గుడ్డెద్దుబండ వద్ద వారికి సుమారు 30 మంది ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల ముఠా ఎదురుపడింది.
పోలీసులను చూసిన వెంటనే వారు రాళ్లు రువ్వి ఎదురుదాడికి దిగారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరి పారు. నిందితులు రాళ్లు రువ్వుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. అలాగే కొండ దిగువ భాగంలో శ్రీవారి పాదాల ప్రాంతానికి ఎడమ వైపు 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి 40 మందితో కూడిన మరో స్పెషల్ పార్టీ పోలీసు బృందం కూం బింగ్‌కు వెళ్లింది. అక్కడ ఈతగుంట ప్రాంతంలో వారికి స్మగ్లర్ల ముఠా తారసపడింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు పోలీ సులపైకి రాళ్లు విసిరారు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. ఈ రెండు సంఘటనలు ఆదివారం సాయంత్రం చీకటి పడిన తర్వాత జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రాథమిక సమాచారం మాత్రమే అందిందని, పోలీసు బృందాలకు స్మగ్లర్లు ఎవైరైనా పట్టుబడ్డారా, ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయా అనేది ఇంకా తెలియలేదని డీఎస్పీ ఇలియాస్‌బాషా చెప్పారు.