చేరువయ్యే వేళ.. ఏం చేస్తుందో? | set up 12 rehabilitation centers | Sakshi
Sakshi News home page

చేరువయ్యే వేళ.. ఏం చేస్తుందో?

Published Sat, Oct 11 2014 3:49 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

చేరువయ్యే వేళ.. ఏం చేస్తుందో? - Sakshi

చేరువయ్యే వేళ.. ఏం చేస్తుందో?

* జిల్లావ్యాప్తంగా ‘హుదూద్’ కలవరం  
* భీతిల్లుతున్న తీరప్రాంతవాసులు
* కాకినాడ పోర్టులో 3వ నంబర్ హెచ్చరిక
* తీర ప్రాంత మండలాల్లో అధికారుల హై అలర్ట్
* నేడు అన్ని పాఠశాలలకూ సెలవు
* కలెక్టరేట్లో ‘1949’తో శాటిలైట్ ఫోన్

ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సోమవారం కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. తుపాను వల్ల జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దెబ్బతిన్నా.. పనిచేసే  శాటిలైట్ ఫోన్‌ను ‘1949’ నంబర్‌తో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేశారు.   కలెక్టర్ నీతూప్రసాద్ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో మాట్లాడి ఈ సదుపాయం కల్పించారు.
 
కాకినాడకు హోప్ ఐలాండ్‌వాసులు
తుపాను విశాఖ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఆ జిల్లాకు ఆనుకుని ఉన్న కోటనందూరు, తొండంగి, తుని, రౌతులపూడి మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తీరప్రాంతంలోని ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, అర్బన్, తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందనే నిర్ధారణకు వచ్చిన యంత్రాంగం ఆ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ మండలాలతో పాటు కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం తీర మండలాలనూ అప్రమత్తం చేశారు. కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్లో రాకపోకలను నిలిపివేశారు.

జిల్లావ్యాప్తంగా 188 జనావాసాల్లోని 1.95 లక్షల మంది తుపాను తాకిడికి గురయ్యే అవకాశం ఉందన్న అంచనాతో వారి పునరావాసానికి 126 భవనాల్ని గుర్తించినట్టు జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు అమలాపురంలో తెలిపారు. తీరానికి కిలోమీటరు దూరంలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ వాసులను కూడా కాకినాడకు తరలించనున్నారు.
 
జిల్లాకు ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
కాగా ఇప్పటికే వేటకు వెళ్లి సముద్రంలో ఉన్న 20 బోట్లలోని మత్స్యకారులతో శుక్రవారం మాట్లాడిన అధికారులు వారిని తీరానికి రప్పించడంలో నిమగ్నమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ ధార్ ఆధ్వర్యంలో ఆరు బృందాలు జిల్లాకు వచ్చాయి. వాటిని తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన మరో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రిజర్వుగా మంగళగిరిలో ఉంచారు.

45 మంది ఉండే ప్రతి బృందానికీ నాలుగు బోట్లు సమకూర్చారు. ఈ బృందాలు తీరం దాటే సమయంలో అవసరమైన తావుల్లో ప్రజలకు రక్షణ కల్పిస్తాయి. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కోస్టుగార్డు, నేవీ తదితర శాఖల అధికారులు తీర గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 
60 టన్నుల బియ్యం సిద్ధం
తుపానుతో బాధితులయ్యే వారి కోసం పౌరసరఫరాల జిల్లా అధికారి రవికిరణ్ ఆధ్వర్యంలో 60 మెట్రిక్ టన్నుల బియ్యం, 168 కిలో లీటర్ల కిరోసిన్ సిద్ధం చేశారు. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనా పనిచేసే ఆరు ఆస్కా దీపాలను అగ్నిమాకశాఖ సిద్ధం చేసింది. జిల్లాలో అన్ని మండలాల అధికారులు 48 గంటల పాటు విధుల్లోనే ఉండాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. తుపాను ప్రత్యేకాధికారి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, జిల్లా ఎస్పీ  రవిప్రకాష్ కలెక్టరేట్లో శుక్రవారం రాత్రి డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement