సెట్‌టాప్ బాక్సుల దహనం | Settop boxes burning | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్సుల దహనం

Published Sat, Jun 18 2016 1:59 AM | Last Updated on Mon, Aug 20 2018 8:10 PM

Settop boxes burning

సాక్షికి మద్దతుగా కొనసాగిన నిరసనలు

 

రాజకీయ అక్కసుతో సాక్షి ప్రసారాల నిలిపివేతపై కొన్ని రోజులుగా పోరాడుతున్నా పట్టించుకోని సర్కారు మొండివైఖరిపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఇదే తీరు కొనసాగితే ఉద్యమాన్ని రాష్ట్ర, జాతీయస్థాయికి తీసుకెళ్తామని.. సాక్షి చానల్ లేని సెట్‌టాప్ బాక్సులను వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం జీవీఎంసీ కార్యాలయం వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహించడంతోపాటు సెట్‌టాప్ బాక్సులను దహనం చేశాయి. దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.

 

వాస్తవాలను వీక్షకుల దృష్టికి తీసుకువెళ్తూ, ప్రభుత్వ అనుచిత నిర్ణయాల పర్యవసానాలను జన బాహుళ్యానికి వివరిస్తూ, ప్రజావాణిని ప్రతిధ్వనింపజేసే మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వ కర్కశ వైఖరిపై ధర్మాగ్రహం వెల్లువవుతోంది. ‘సాక్షి’ చానల్ ప్రసారాలను నిలిపివేస్తూ  తొమ్మిది రోజులుగా తన అసహనాన్ని బహిరంగంగా చాటుకుంటున్న ప్రభుత్వం తీరుపై పాత్రికేయుల, మీడియా సంఘాల నిరసన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న ఆవేశం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం గల ఆకాంక్షకు అద్దం పడుతోంది.

 

ద్వారకానగర్: ‘సాక్షి’ చానల్ ప్రసారాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను తలపిస్తోందంటూ జిల్లాలోని వివిధ జర్నలిస్టు సంఘాలు,ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అణచివేత వైఖరికి నిరసనగా తొమ్మిది  రోజులుగా ఆందోళన లు, ధర్నాలు చేపడుతున్నాయి. వాస్తవాలను జనం ముందుకు తెస్తున్న ‘సాక్షి’ చానల్‌పై ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. శుక్రవారం కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ‘సాక్షి’ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ శుక్రవారం విశాఖలో జర్నలిస్టుల సంఘాలు  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు, ‘సాక్షి’ మీడియా ఉద్యోగులు ప్లకార్డులతో నిరసనలు తెలుపుతూ ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరుగుతున్న అన్యాయాన్ని బాపూజీ దృష్టికి తెచ్చే విధంగా ఆయన విగ్రహానిని వినతిపత్రం సమర్పించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. జంక్షన్‌లో మానవహారం ఏర్పాటు చేసి అరగంటకు పైగా రాస్తారోకో చేశారు. రోడ్డుపై జర్నలిస్టు సంఘాల నేతలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల ఆశీలుమెట్ట, జగదాంబ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

 
నిరంకుశత్వం.. అనుచితం

ధర్నాలో సీనియర్ పాత్రికేయుడు ప్రభాకర శర్మ మాటాడ్లుతూ పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే విధంగా ప్రభుత్వం నిరంకుశ ధోరణి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాలరాయడాన్ని ప్రజలు హర్షించరని అన్నారు. మరో సినీయర్ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి మాట్లాడుతూ ‘సాక్షి’ చానల్‌ను పునరుద్ధించేంతవరకు  ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. ఎంఎస్‌వోలు తలవొగ్గే విధంగా కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. మీడియాను నియంత్రించడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.  ఎంఎస్‌వోలు కూడా ‘సాక్షి’ చానల్ పునరుద్ధరణకు కృషి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్‌ల ఫ్రంట్ అధ్యక్షుడు  ఎం.ఆర్.ఎన్. వర్మ మాట్లాడుతూ ‘సాక్షి’ చానల్ ప్రసారాలు నిలిపివేయడం తగదని అన్నారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ‘జాప్’ ప్రధాన కార్యదర్శి ఎం. యుంగధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశంపై హైకోర్టులో వ్యాజ్యంపై తీర్పు వెలువడనుందని, తర్వాతైనా ‘సాక్షి’ ప్రచారాలు పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తప్పవన్నారు.ై వెజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ‘సాక్షి’ టీవీపై నిషేధం అమానుషమని విమర్శించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియాను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికే నష్టమని చెప్పారు. ‘సాక్షి’ని ఇంకా అడ్డుకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె. రాము మాట్లాడుతూ ప్రభుత్వాలు కూలుతాయి తప్ప, మీడియా పదిలంగా ఉంటుందని అన్నారు.

రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని  ప్రభుత్వానికి హెచ్చరించారు. జాప్ జిల్లా అధ్యక్షుడు ఎల్‌జీ నాయుడు మాట్లాడుతూ చానళ్లను నిలిపివేస్తే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని  హెచ్చరించారు. పద్ధతి మారకుంటే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అనంతరం జీవీఎంసీ ఎదురుగా రహదారిపై జర్నలిస్టులు సెట్‌టాప్ బాక్స్‌ను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసు లు అడ్డుకున్నారు. కార్యక్రమంలో  ఫొటో జర్నలిస్ట్‌ల అసోసియేషన్ ప్రతినిధి మాధవ్, ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి జి.ఉమాకాంత్, సాక్షి రీజనల్ మేనేజర్  కోటారెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రంగనాథ్,  ఏపీ డబ్ల్యూజే నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎన్. సత్యనారాయణ, పెందుర్తి ఏపీడబ్ల్యూజే కార్యదర్శి రవి, కార్యవర్గ సభ్యులు డి. సుబ్బు, టి.రాకేష్, రామకృష్ణ, క్రైం రిపోర్టుల సంఘం ప్రతినిధులు ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, దాడి రవికుమార్, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement