పలు డిమాండ్లతో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ధర్నా..   | Indian Journalists Union Commence Protests Across The Country With Various Demands - Sakshi
Sakshi News home page

పలు డిమాండ్లతో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ధర్నా..  

Published Mon, Oct 2 2023 4:46 PM | Last Updated on Mon, Oct 2 2023 5:48 PM

Journalists Union Commence Protest With Few Demands   - Sakshi

హైదరాబాద్: వివిధ డిమాండ్లతో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ)  దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా గాంధీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని మొత్తం 122 కేంద్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  

మహాత్మునికి నివాళి.. 
గాంధీ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని ఎంజి రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐజేయూ డిమాండ్ల వినతి పత్రాన్ని అక్కడ ప్రదర్శించారు.

గవర్నర్‌కు వినతిపత్రం..
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌కు వినతి పత్రాన్ని అందించింది. దేశంలో మీడియా మరియు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు జారీ చేయాలనే డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రతినిధి బృందానికి గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు  యూసుఫ్ బాబులు ప్రతినిధి బృందంలో ఉన్నారు.

అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా..
ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద టీయూడబ్ల్యూజే, హెచ్.యూ.జేల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ మీడియా సంస్థలు, జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య సాధింపు ధోరణిని మానుకోవాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాగే జర్నలిస్టుల సౌకర్యాలను రద్దు చేసే చర్యలకు స్వస్తి పలకాలని విరాహత్ సూచించారు. 

ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్ లు మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.  దాడులను అరికట్టేందుకు దేశంలో మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.మహిపాల్ రెడ్డి, ఏ.రాజేష్, షౌకత్ హమీద్, చారీ, శ్రీనివాస్ రెడ్డి, ప్రతిభ, గౌస్, అశోక్, వెంకటయ్యలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement