తుపాను హెచ్చరికతో అప్రమత్తం
విజయనగరం కంటోన్నెంట్: తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను రాన్ను మూడు రోజుల్లో విశాఖపట్నం-గోపాలపట్నం మధ్య ఎక్కడైనా తీరం దాటవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ హెచ్చరించారు. ముఖ్యంగా పూసపాటి రేగ, భోగాపురం తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తుపాను సందర్భంగా ఎదురయ్యే సమస్యలేమైనా ఉంటే 08922-278770 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని కలెక్టర్ సూచించారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 08922-276888, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08963-221006 నంబర్లకు కూడా సమాచారం అందివ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు
విజయనగరం మున్సిపాలిటీ: హుద్ తుపాను కారణంగా జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సమయంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, సరఫరాలో అంతరాయం వాటిల్లినా తక్షణ సమాచారం తెలుసుకునేందుకు స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో ఎమర్జెన్సీ విద్యుత్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తక్షణ సమాచారాన్ని అందజేసేందుకు 9490610102 నంబర్‌ను సంప్రదించాలని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ సి .శ్రీనివాసమూర్తి కోరారు. తుపాను కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలతో పాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖాధికారులను, సిబ్బందిని ఆదేశించటం జరిగిందన్నారు.
వేటకు వెళ్లొద్దు-మత్స్య శాఖ ఎ.డి.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఎ.డి. ఫణిప్రకాష్ హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి హుద్ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రంలో పరిస్థితులు అనుకూలించవనే ఉద్దేశంతో మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని సూచించారు.