తరుముకొస్తున్న పెథాయ్‌ | Severe cyclonic threat to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తరుముకొస్తున్న పెథాయ్‌

Published Mon, Dec 17 2018 2:55 AM | Last Updated on Mon, Dec 17 2018 10:30 AM

Severe cyclonic threat to Andhra Pradesh - Sakshi

కాకినాడ ఉప్పాడ బీచ్‌లో ఎగిసిపడుతున్న కెరటాలు

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రానికి పెథాయ్‌ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. పెథాయ్‌ తీవ్ర తుపానుగా మారి శరవేగంగా దూసుకొస్తోంది. కాకినాడకు పశ్చిమ ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 410 కిలోమీటర్ల దూరంలో ఇది తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది.  అర్ధరాత్రి సమయానికి కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. సోమవారం మధ్యాహ్నం తుని–యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పెథాయ్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. (పెథాయ్‌ ఎఫెక్ట్‌: ఏపీలో పలు రైళ్లు రద్దు)

ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెథాయ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాన్‌ ధాటికి పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పెథాయ్‌ నేపథ్యంలో అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెథాయ్‌ తీవ్ర తుపానుగా మారుతుందని, కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  

100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 
పెథాయ్‌ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 110 కిలోమీటర్ల స్థాయికి కూడా చేరుకుంటాయని ఐఎండీ ప్రకటించింది. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుపాను పరిస్థితి గురించి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. కోస్తాంధ్రలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల సహాయార్థం 1100 నంబర్‌ హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచింది.

అధికార యంత్రాంగం అప్రమత్తం 
తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ పోర్టులో ఏడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరంలో 6, నిజాంపట్నం, మచిలీపట్నంలో 5, కళింగపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణం అందించేందుకు, సమాచారం చేరవేసేందుకు డివిజనల్, మండల కేంద్రాల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత మండలాల్లో సోమ, మంగళవారాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చినట్లు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), జాతీయ విపత్తు సహాయక దళాలు(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహాయక కార్యక్రమాల కోసం రంగంలోకి దిగాయి. 

ఈదురుగాలుల బీభత్సం 
తుపాను సోమవారం తీరం దాటనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్నం, భీమిలి, పెదగంట్యాడ, గాజువాక తదితర ఎనిమిది తీర మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. సహాయక దళాలను సిద్ధం చేసింది. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి కొబ్బరిచెట్లు విరిగిపడడంతో ఆవు మృతి చెందింది. తిత్లీ తుపాను వల్ల దారుణంగా నష్టపోయి ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లా వాసులు పెథాయ్‌ తుపానుతో కలవరపడుతున్నారు. కోసిన, కోత దశకు వచ్చిన వరి పంట పాడవుతుందని ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ గాలులు వీస్తే కొబ్బరి తోటలు పడిపోతాయనే భయం కోనసీమ రైతులను వెంటాడుతోంది. (దగ్గరవుతున్న పెథాయ్‌ ముప్పు ..)

కాకినాడ–తుని బీచ్‌ రోడ్డుపై రాకపోకలు నిలిపివేత 
తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాలపై పెథాయ్‌ విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో వర్షం ప్రారంభమైంది. సముద్రం భీకరంగా మారింది. అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున కెరటాలు దూసుకొస్తుండటంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ–తుని బీచ్‌ రోడ్డుపై కెరటాలు వచ్చిపడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్‌ రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుపాను షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం 1,664 మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. 

30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం  
పెథాయ్‌ తుపాను ఉత్తరాంధ్ర ప్రజలను వణికిస్తోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలను చూసి బెంబేలెత్తుతున్నారు. తీర గ్రామాల్లో ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదివారం పర్యటించారు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ తీర గ్రామాల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. 

తీరం వెంబడి 40 కి.మీ వేగంతో గాలులు 
పెథాయ్‌ ప్రభావంతో గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పాటు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గుంటూరు జిల్లాపై తుపాను ప్రభావం అంతగా ఉండదని, తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ వీడియోకాన్ఫరెన్స్, సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారు. పశ్చిమ డెల్టాలో వరి పంట, పల్నాడు ప్రాంతంలో మిరప, పత్తి చేతికొచ్చే దశలో ఉన్నాయి. వీటిని ఇంటికి చేర్చుకొనేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. తుపాను వల్ల వర్షం ఎక్కువ కురిస్తే కోత దశలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

సముద్ర తీరం అల్లకల్లోలం  
తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వాకాడు, విడవలూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరిగింది. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 13 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. సముద్రంలో వేటకు వెళ్లిన 200 పడవలను వెనక్కి రప్పించారు. పెథాయ్‌ వల్ల ఎలాంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు తెలిపారు. 

ప్రత్యేక అధికారుల నియామకం 
ప్రకాశం జిల్లాలో పెథాయ్‌ తుపాను ఇప్పటికే ప్రభావం మొదలైంది. చలిగాలుల తీవ్రతతోపాటు జిల్లా అంతటా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. తీర ప్రాంతంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగసి పడుతున్నాయి. సోమవారం జిల్లాలో అతిభారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు. తుపాను సమాచారం కోసం ఒంగోలు కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్‌ 1077, ఫోన్‌ నెంబర్‌ 08592–281400 తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 14 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.  

‘పశ్చిమ’లో పెథాయ్‌ అలజడి 
పెథాయ్‌ తుపాను పశ్చిమ గోదావరి జిల్లావాసులను వణికిస్తోంది. ఆదివారం ఉదయం పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. తీరంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, యలమంచిలి, పాలకొల్లు మండలాల్లో తుపాను ప్రభావం చూపుతోంది. 26 పునవాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల్లో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌ తీగలు తెగాయి. ఫలితంగా రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. 

అలసత్వం వద్దు : సీఎం
పెథాయ్‌ తుపాను సహాయక చర్యలను అలసత్వం లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సహాయక చర్యలపై ఆయన ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సహాయ చర్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, మంచినీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈదురుగాలుల ధాటికి రోడ్లపై కూలిపోయిన చెట్లనే వెంటనే తొలగించి, రాకపోకలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను పూర్తిగా నింపి కనీసం 45 రోజుల దాకా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను బాధితులకు సకాలంలో ఆహారం పంపిణీ చేయాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు. 

బీభత్సం సృష్టించే అవకాశం 
సాక్షి, విశాఖపట్నం: పెథాయ్‌ తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా బలపడింది. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 26 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత కాకినాడ పరిసరాల్లో తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. అయితే, ఆర్టీజీఎస్‌ మాత్రం కాకినాడ–తునిల మధ్య తీరం దాటవచ్చని వెల్లడించింది. మరోవైపు అమెరికా నిర్వహిస్తున్న జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌(జేటీడబ్లు్యసీ) విశాఖ సమీపంలో తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. ఇలా మూడు సంస్థల వేర్వేరు అంచనాలతో పెథాయ్‌ ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఒకింత గందరగోళం నెలకొంది. హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు ముందుగా తాము పేర్కొన్న చోటే తీరం దాటాయని ఐఎండీ చెబుతోంది. కోస్తాంధ్రలో ఒకట్రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. తుపాను తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఐఎండీ సూచించింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, పాతఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, రోడ్లకు గండు పడవచ్చని, వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటాయని హెచ్చరించింది.

‘పెథాయ్‌’ పేరు వెనక...
మొన్న తిత్లి. నిన్న గజ. నేడు పెథాయ్‌. పేర్లు వేరైనా అవన్నీ ఇటీవల వేర్వేరు రాష్ట్రాల్లో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లి పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న తుపానుకు పెథాయ్‌ అని పేరు పెట్టింది థాయిలాండ్‌. పెథాయ్‌ అంటే థాయిలాండ్‌ భాషలో గింజ అని అర్థం. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్‌ మహాసముద్రాల్లో వచ్చే తుపానులకు వాడిన పేర్లను మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత వాడుతారు.  ఇందుకోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో సంభవించే తుపాను ఊహించిన దానికన్నా తీవ్రతరమైనా, ఆ పేరు అయోగ్యమైనదని భావించినా దాన్ని జాబితా నుంచి తొలగించి కొత్త పేరు చేర్చుతారు. కానీ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడరు. భవిష్యత్‌లో సంభవించే తుపానులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, థాయిలాండ్‌ దేశాలు  సూచించిన పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధమైంది. రాబోయే తదుపరి తుపానుకు ఫణి, వాయు, మహా, బుల్‌బుల్‌లలో ఏదో ఒక పేరును పెట్టనున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
- తీరం దాటే సమయంలో రహదారులపై తిరగరాదు
లోతట్లు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
బలమైన గాలులు వీచే అవకాశముంది కాబట్టి చెట్ల కింద నిలవరాదు
తుపాన్‌ సహాయం కోసం 1100 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలి

పునరావాస కేంద్రంలో ఆకలి కేకలు 
కృష్ణా జిల్లాలోని తీర మండలాలైన మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్నులో పెథాయ్‌ ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా తేలికపాటి వర్షాలు పడ్డాయి. జిల్లాలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతమైంది.  చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గిలకలదిన్నె తీరానికి చేరారు. తీర ప్రాంతాల్లో 64 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలు ఆకలితో అలమటించారు. 60 మంది ఉన్న కేంద్రంలో కేవలం 10 కిలోల బియ్యం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. మంగినపూడి బీచ్‌లో అలల ఉధృతి పెరిగింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నేలకొరిగింది. 

మత్య్సకారుల్లో గుబులు 
పెథాయ్‌ హెచ్చరికలు గంగపుత్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో మత్య్సకారుల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి పాయకరావుపేట వరకు తూర్పుతీరం వెంట 110 కిలోమీటర్ల పరిధిలో 47 మత్య్సకార గ్రామాలున్నాయి. వీటిలో చాలావరకు తీరానికి ఆనుకుని కూతవేటు దూరంలో ఉన్నవే. విశాఖ జిల్లాలో తీరప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సృజన పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తీరప్రాంతంలోని గ్రామాల ప్రజలకు భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రొక్లెయిన్లు, జనరేటర్లు, మంచినీటి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. 

రైతన్నల ఆందోళన : శ్రీకాకుళం జిల్లాలో రాజాం, ఎచ్చెర్ల, రణస్థలం, శ్రీకాకుళం తదితర మండలాల్లో జల్లులు కురిశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో కోసి ఉన్న వరి పనలను భద్రపరుచుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. నిత్యావసరాలను పునరావాస కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు. 

సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు
కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని దుమ్ములపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులతో గత మంగళవారం వేటకు వెళ్లిన 3573 నంబరు బోటు సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో తమవారి కోసం ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. బోటులో ఆయిల్‌ అయిపోవడంతో ఐ.పోలవరం మండలం భైరవపాలేనికి 10 మైళ్ల దూరంలో ఉండిపోయామని, అక్కడ రిగ్గో లేక ఓడో తెలియడం లేదని, దానికి బోటు కట్టి ఉన్నామని, తమను రక్షించాలని మత్స్యకారులు తమకు సమాచారం అందజేశారని కుటుంబ సభ్యులు ఆదివారం విలేకర్లకు తెలిపారు. సముద్రంలో చిక్కుకుపోయిన వారిలో కళాసీలు వాసుపల్లి దానియేలు, మారుపల్లి సతీష్, పేర్ల కాసులు, కంది పాపయ్య, వాసుపల్లి ఎర్రయ్య, మేరుగు ఏసేబు ఉన్నారని వివరించారు. తమవారు సముద్రంలో చిక్కుకుపోయిన సమాచారాన్ని మత్స్యశాఖ అధికారులకు, కలెక్టరేట్‌కు సమాచారం అందించామన్నారు. . 

అప్రమత్తమైన నౌకాదళం 
సహాయ చర్యలకు సిద్ధమైన ఈఎన్‌సీ
విశాఖసిటీ: పెథాయ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) అప్రమత్తమైంది. తుపాను తీవ్ర తుపానుగా మారుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన మానవతా సహాయాన్ని అందించేందుకు సమాయత్తమైంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సమీపంలో ఉన్న నౌకాశ్రయానికి తిరిగి వెళ్లిపోవాలని రెండు రోజులుగా 11 నేవీ విమానాల ద్వారా నౌకాదళ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. తూర్పు నౌకాదళ హెచ్‌ఏఆర్‌డీలో భాగంగా పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలించడంతో పాటు లాజిస్టిక్‌ సపోర్టు అందించేందుకు, వైద్య సహాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అదనపు వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు, గ్యాస్‌ రబ్బర్‌ పడవలు, సహాయ సామగ్రి, ఆహారం, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు సిద్ధం చేసినట్లు వివరించారు. జెమినీ బోట్లతో డైవర్లు అప్రమత్తంగా ఉన్నారని, ఏక్షణంలోనైనా వెళ్లేందుకు రెస్క్యూటీమ్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమాచారం అందిపుచ్చుకునే విధంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్‌ డేగాలో సహాయ సామగ్రితో నౌకాదళ బృందం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement