గజ్వేల్, న్యూస్‌లైన్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తా లేకుండా పోయింది. ఈసారి జిల్లాలో భారీగా పత్తి దిగుబడులు వచ్చే అవకాశమున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. పైగా ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తుండటం.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడం ఊపందుకున్న తరుణంలో ఈ పరిస్థితి తలెత్తడం శాపంగా మారింది.
జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 వేల మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. గజ్వేల్‌లో పది రోజులుగా వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ. 3,700 నుంచి 3,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 2 వేల క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రాలలో తెల్ల బంగారానికి రూ.4,500నుంచి 5,000 వరకు ధర పలుకుతుండగా ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో లారీలను వ్యాపారులు తరలిస్తున్నారు. రైతులవద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్‌లోకి వచ్చాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది.
కమర్షియల్ పర్చేజ్ జరిగేనా..
2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4 వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3 వేలు మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా రాష్ట్రంలోని వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వేల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను కూడా చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్‌లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు. కానీ రెండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు.
కేంద్రాలను తెరవాలని సీసీఐని కోరాం
పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని సీసీఐ ఉన్నతాధికారులను కోరాం. ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల పత్తి ఉత్పత్తులు మార్కెట్‌లోకి తొందరగా రావడం ఆరంభమైందని వివరించాం. త్వరలోనే కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశమున్నది. ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టాలని కూడా కోరాం. సంబంధిత అధికారుల సానుకూలంగా స్పందించారు. జిల్లాలో కొత్తగా సదాశివపేట, వట్‌పల్లిలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల పంపాం.
-రాజశేఖర్, జేడీ, మార్కెటింగ్‌శాఖ
సీసీఐ జాడేది?
Published Wed, Oct 23 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement