సీసీఐ.. కొనుగోళ్లకు సై! | Cotton Corporation of India ready to cotton purchase | Sakshi
Sakshi News home page

సీసీఐ.. కొనుగోళ్లకు సై!

Published Wed, Nov 6 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Cotton Corporation of India ready to cotton purchase

గజ్వేల్, న్యూస్‌లైన్:  సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వైఖరిలో క్రమంగా మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కొన్ని రోజులు మాత్రమే కొనుగోళ్లు చేపట్టి చేతులెత్తేసిన ఆ సంస్థ.. ఈసారి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా కమర్షియల్ పర్చేజ్ చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రైతులకు భారీ ప్రయోజనం చేకూరే అవకాశముంది.  2011లో మాదిరిగా మద్దతు ధరతో ప్రమేయం లేకుండా ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టి రైతులకు అండగా నిలవడానికి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లాకు చెందిన ఓ సీసీఐ అధికారి ‘న్యూస్‌లైన్’కు  తెలిపారు. మరో వారం తర్వాత దీనిపై స్పష్టంగా ఆదేశాలు రానున్నాయని, ఆదేశాలు రాగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. పత్తి ధర రూ.4 వేల నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి నెలలో రూ.7 వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస  మద్దతు ధర రూ.3,000 మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్‌తోపాటు గజ్వే ల్ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులతో పోటీపడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7 వేల వరకు ధరను చెల్లించింది. ఈ లెక్కన గజ్వేల్ లో ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ పోటీలు పడి కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఇక్కడ 2.72 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రికార్డును సృష్టించారు.
 పడిపోయిన పత్తి ధర....
 జిల్లాలో ఈసారి 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లోకి ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.4000మద్దతు ధర కూడా రైతులకు అందడంలేదు. పదిరోజుల క్రితం కురిసిన తుపాన్ కారణంగా పత్తి తడిసిపోయిందనే కారణంతో వ్యాపారులు కేవలం క్వింటాలుకు రూ.3000నుంచి రూ.3500 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు వేలాది క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు.
 విధిలేక పత్తిని అమ్ముకున్నా
 మంచి ధర వస్తుందనే ఆశతో 18 క్వింటాళ్ల పత్తిని  గజ్వేల్ యార్డుకు తెచ్చిన. ఇక్కడికొస్తే ఏం లాభం క్వింటాల్‌కు రూ.3,350 మాత్రమే చెల్లిస్తుండ్రు. వానలకు పత్తి కొద్దిగా తడిసినందుకే ఇంత ధర తక్కువ చేయడం న్యాయం కాదు. డబ్బులు అవసరముండి విధిలేక పత్తిని అమ్ముకున్న.
 - నర్సింలు, పత్తి రైతు,ఇంద్రానగర్,నల్గొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement