నెల్లూరు (లీగల్) : ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశాడని నమోదు అయిన కేసులో నేరం రుజువు కావడంతో విడవలూరు మండలం ముదివర్తికి చెందిన నిందితుడు షేక్ సుబాన్‌బాషాకు జీవిత ఖైదుతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ మొదట అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఏ జగదీష్‌చంద్రరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు సూళ్లూరుపేట మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తాటిపర్తి పద్మావతి నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో 2010లో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటుండేది. అక్టోబరులో దసరా సెలవులు ఇవ్వడంతో ఆమె తన గ్రామానికి వెళ్లింది.
అక్కడ ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో కళాశాలకు రాలేదు. ఆమె 2011 ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా బ్యాగుతో ఇల్లు వదిలి నెల్లూరుకు వచ్చింది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సెల్‌ఫోన్ కొనుగోలు చేయడానికి ట్రంకురోడ్డులోని ఓ సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లింది. నిందితుడు సుబాన్‌బాషా తన వద్ద ఉన్న పాత సెల్‌ఫోన్ అమ్మడానికి అదే షాపులోకి వెళ్లాడు. వీరిద్దరి మధ్య అక్కడ పరిచయం ఏర్పడింది. పద్మావతి కొత్త సెల్‌ఫోన్ కొని సిమ్ కావాలని అడగడంతో ఫొటో అడ్రసు కావాలని దుకాణం నిర్వాహకులు అడిగారు. దీంతో నిందితుడు ఆమెను దగ్గరలోని స్టూడియోకి తీసుకెళ్లి ఫొటోలు తీయించి సిమ్ తీసుకుని బయటకు వచ్చారు.
ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్నానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాని తెలిపడంతో తనకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడని, అతని ద్వారా నీకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అదే ప్రాంతంలో ఉన్న ఓ వస్త్ర దుకాణంలోకి వెళ్లారు. అక్కడ నిందితుని స్నేహితుడు లేకపోవడంతో బయటకు వచ్చారు. ఆమె నీ ఇల్లు ఎక్కడ ఉందని అతన్ని అడగటంతో ఎన్టీఆర్‌నగర్ దగ్గరలో ఉందని చెప్పాడు. నేను కూడా మీ ఇంటికి వస్తానని చెప్పడంతో ఇద్దరు నడుచుకుంటూ బాలాజీనగర్ బ్రిడ్జి వద్దకు వచ్చి, అక్కడ ఆటో ఎక్కి పద్మావతినగర్ ప్రాంతంలో దిగారు.
ఇక్కడ నుంచి మా ఇంటికి దగ్గర దారి ఉందని, ఎస్‌వీజీఎస్ కళాశాల గ్రౌండ్ వద్దకు తీసుకుని వెళ్లాడు. అక్కడ నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. అంతట ఆమె పెద్దగా అరవడంతో నోరు మూసి గొంతు నొక్కడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అంతట ఆమెపై లైంగికదాడి చేసి పైజామా చున్నీతో గొంతుకేసి లాగి చంపాడు. ఆమె వద్ద ఉన్న బ్యాగులో నుంచి రూ.2,500 నగదు , చెవి కమ్మలను తీసుకుని మృతదేహాన్ని రాళ్లగుట్ట వద్దకు తీసుకుని వెళ్లి రాళ్లు కప్పి వెళ్లాడు.
నెల్లూరు వీఆర్‌ఓ ఓజిలి గున్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజర పరిచారు. చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు విచారణలో నిందితుడిపై నేరం రుజువు చేయడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. అయ్యపరెడ్డి కేసు వాదించారు.
లైంగికదాడి, హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
Published Fri, Sep 26 2014 3:35 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Advertisement