![Srinivas Kuchibhotla's killer sentenced to life imprisonment - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/6/srinivas-kuchibotla.jpg.webp?itok=eg3K08Qz)
శ్రీనివాస్ (ఫైల్), ప్యూరింటన్ (ఫైల్)
వాషింగ్టన్: అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది ఫిబ్రవరిన 22న కన్సాస్‌లోని ఒక బార్‌లో కూచిభొట్ల, అతని స్నేహితుడు ఉన్నపుడు నిందితుడు ఆడం ప్యూరింటన్(52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ కాల్పులు జరిపి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ప్యూరింటన్ దాదాపు 78 ఏళ్లు జైల్లో గడపాలని ఫెడరల్ న్యాయమూర్తి శనివారం తీర్పునిచ్చారు.
అతనికి 100 ఏళ్లు పూర్తయినా బెయిలు లభించకుండా కోర్టు కఠిన శిక్ష విధించింది. కూచిభొట్ల హత్య కేసుతో పాటు అతని స్నేహితుడు అలోక్ మేడసానిపై, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపై కాల్పులు జరిపినందుకు ప్యూరింటన్‌పై అభియోగాలు మోపారు. అమెరికా అటార్నీ కార్యాలయం సైతం గత ఏడాది జూన్‌లో జాతి విద్వేష నేరం కింద మరో కేసు దాఖలు చేసింది. కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య సునయన స్వాగతించారు.
‘విద్వేషం ఎన్నటికి అంగీకారయోగ్యం కాదనే గట్టి సందేశం ఇచ్చింది. ఈ కేసులో పూర్తిగా సాయపడిన జిల్లా అటార్నీ ఆఫీసుకు, ఒలేథ్ పోలీసులకు నా కృతజ్ఞతలు’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల జీపీఎస్ తయారీ సంస్థ ‘గర్మిన్’లో ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీర్, ప్రోగ్సామ్స్ మేనేజర్‌గా పనిచేసేవారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నుంచి ఎలక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment