కోర్టుకు హాజరైన కూచిభొట్ల హంతకుడు | Kansas Shooting Suspect Adam Purinton Appears In Court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన కూచిభొట్ల హంతకుడు

Published Tue, Feb 28 2017 11:03 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

కోర్టుకు హాజరైన కూచిభొట్ల హంతకుడు - Sakshi

కోర్టుకు హాజరైన కూచిభొట్ల హంతకుడు

అభియోగాలు రుజువైతే 50 ఏళ్లపాటు కారాగారంలోనే...

హూస్టన్‌/ఒలాతే/న్యూఢిల్లీ/హైదరాబాద్‌: యువ ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితుడైన అమెరికా నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడంపూరింటన్‌ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. 51 ఏళ్ల ఆడంను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పోలీసులు స్థానిక జాన్సన్‌ కౌంటీ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఒలాతేలోని బార్‌లో జరిపిన కాల్పుల కేసుకు సంబంధించి నిందితుడు... హత్యాభియోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అభియోగాలు రుజువైతే నిందితుడికి 50 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తారని జాన్సన్‌ కౌంటీ జిల్లా కోర్టు అటార్నీ స్టీవ్‌ హోవ్‌ చెప్పారు.

గార్మిన్‌ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్‌...ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు పూరింటన్‌ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్‌ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్‌ చనిపోవడం తెలిసిందే.  పూరింటన్‌ తరఫున మైఖెల్లె డ్యూరెట్‌..అటార్నీగా వ్యవహరించనున్నారు.  

                                   అంత్యక్రియల అనుంతరం విలపిస్తున్న శ్రీనివాస్‌ తండ్రి
ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి
యువ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ హత్య ఘటనపై శ్వేతసౌధం మీడి యా కార్యదర్శి సియాన్‌ మాట్లాడుతూ కన్సాస్‌ నుంచి తమకు అందిన నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు.

కాల్పులు జరిపినట్టు ఒప్పుకున్నాడు
ఇద్దరిపై కాల్పులు జరిపిన మాట వాస్తవమేనంటూ నిందితుడు పూరింటన్‌ అంగీకరించాడని బార్‌లో సహాయకుడిగా ఉద్యోగం చేస్తున్న శాం సుయిడా చెప్పాడు. అయితే వారు ఇరాన్‌ జాతీయులై ఉండొచ్చని అన్నట్టు పేర్కొన్నాడు. ‘ మా దేశం విడిచి వెళ్లిపోండి’ అంటూ నిందితుడు అరిచాడని  ప్రత్యక్ష సాక్షి తెలియజేశాడు. ఒలాతేలో కాల్పులకు పాల్పడిన అనంతరం పూరింటన్‌ అక్కడినుంచి 70 కి.మీ దూరంలోగల మిస్సోరి ప్రాంతంలోని క్లింటన్‌ ఏరియాలోగల యాపిల్‌బార్‌కు వెళ్లాడు. ‘నేను తప్పు చేశాను. ఒలాతేలో ఇద్దరు ఇరాన్‌ జాతీయులను కాల్చిచంపాను. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పరారై ఇక్కడికి వచ్చాను’ అని చెప్పినట్టు సాం పేర్కొన్నాడు.

సునయనకు గార్మిన్‌ అండ
దారుణ హత్యకు గురైన శ్రీనివాస్‌ భార్య సునయనకు అండగా నిలబడేందుకు ఆయన పనిచేసిన గార్మిన్‌ కంపెనీ ముందుకొచ్చింది. శ్రీనివాస్‌.. హెచ్‌1బి వీసాతో అమెరికా వచ్చారు. హత్య నేపథ్యంలో అంత్యక్రియల తర్వాత సునయన మళ్లీ అమెరికా వెళ్లేందుకు వీలవదు. ఈ విషయాన్ని ఆమె అమెరికాలో ఉన్నప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పి.. గార్మిన్‌ కంపెనీ తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు, ఇక్కడ తాను శ్రీనివాస్‌ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతమయ్యేందుకు సాయపడాలని కోరారు. శ్రీనివాస్‌కు హెచ్‌1బి వీసా ఉండగా, సునయనకు హెచ్‌4 వీసా ఉంది. దాని ఆధారంగా ఆమె అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు వీలవుతుంది. ఇప్పుడు సునయన అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు గార్మిన్‌ న్యాయ ప్రతినిధులు, వాళ్ల ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సాహసికుడికి సలాం: భారత్‌
ఒలాతే బార్‌లో కాల్పులకు తెగబడిన పూరింటన్‌ అడ్డుకునేందుకు అమెరికావాసి ఇయాన్‌ గ్రిల్లట్‌ చేసిన సాహసాన్ని భారత్‌ ప్రశంసించింది. ‘గ్రిల్లట్‌ హోరోయిజానికి భారత్‌ సలాం చేస్తోంది. అతను త్వరగా కోలుకోవాలి’ అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీటర్‌లో ఆకాంక్షించారు.

ఆంగ్లంలోనే సంభాషించాలి: టీఏటీఏ
అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇంగ్లిష్‌లోనే సంభాషించాలని తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీఏటీఏ)సూచించింది. శ్రీనివాస్‌ హత్య ఘటన నేపథ్యంలో తన ఫేస్‌బుక్‌ పేజీలో మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన ఉంచింది. బహిరంగ ప్రదేశాల్లో వాగ్వాదాలకు దిగొద్దని, ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement