kuchibotla srinivas
-
మూడు జీవిత కాలాల జైలు శిక్ష
న్యూయార్క్: గతేడాది ఫిబ్రవరిలో అమెరికాలోని కన్సస్‌లో తెలుగు వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేష కారణంతో కాల్చి చంపిన కేసులో అమెరికా నౌకాదళ మాజీ సభ్యుడు ఆడం పురింటన్‌కు కోర్టు మూడు జీవిత కాలాల జైలు శిక్షను విధించింది. కన్సస్‌లోని ఓ బార్లో శ్రీనివాస్, ఆయన స్నేహితుడు మాడసాని అలోక్ కూర్చొని ఉండగా పురింటన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అలోక్‌తోపాటు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికా జాతీయుడికి గాయాలయ్యాయి. జాతీయత విద్వేషాలతోనే తాను కాల్పులు జరిపినట్లు పురింటన్ ఒప్పుకున్నాడు. పురింటన్‌కు విధించిన మూడు జీవిత కాల శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. మృతుడు శ్రీనివాస్ భార్య సునయన పురింటన్‌ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘నువ్వు నా భర్తను ఏమని పిలవాలని (జాతి వివక్ష వ్యాఖ్యలు) అనుకున్నావో ఆయన అంతకంటే చాలా మంచివారు. నువ్వు ఆయనతో మాట్లాడి ఉంటే ఛామన ఛాయలో ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్లే కాదనీ, వారిలో ఎంతోమంది అమెరికా వృద్ధికి దోహదపడుతున్నారని వివరించేవారు. ఎన్నో కలలు, ఆశలు, ఆకాంక్షలతో అమెరికాకు వచ్చాం. ఇప్పుడు నా అమెరికా కల, మా ఆయన కల చెదిరిపోయాయి’ అని విలపించారు. ఈ ప్రకటనను కోర్టులోనే అధికారులు చదివి పురింటన్‌కు వినిపించారు. -
‘కూచిభొట్ల’ దోషికి జీవితఖైదు
వాషింగ్టన్: అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది ఫిబ్రవరిన 22న కన్సాస్‌లోని ఒక బార్లో కూచిభొట్ల, అతని స్నేహితుడు ఉన్నపుడు నిందితుడు ఆడం ప్యూరింటన్(52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ కాల్పులు జరిపి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ప్యూరింటన్ దాదాపు 78 ఏళ్లు జైల్లో గడపాలని ఫెడరల్ న్యాయమూర్తి శనివారం తీర్పునిచ్చారు. అతనికి 100 ఏళ్లు పూర్తయినా బెయిలు లభించకుండా కోర్టు కఠిన శిక్ష విధించింది. కూచిభొట్ల హత్య కేసుతో పాటు అతని స్నేహితుడు అలోక్ మేడసానిపై, అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపై కాల్పులు జరిపినందుకు ప్యూరింటన్పై అభియోగాలు మోపారు. అమెరికా అటార్నీ కార్యాలయం సైతం గత ఏడాది జూన్‌లో జాతి విద్వేష నేరం కింద మరో కేసు దాఖలు చేసింది. కోర్టు తీర్పును శ్రీనివాస్ భార్య సునయన స్వాగతించారు. ‘విద్వేషం ఎన్నటికి అంగీకారయోగ్యం కాదనే గట్టి సందేశం ఇచ్చింది. ఈ కేసులో పూర్తిగా సాయపడిన జిల్లా అటార్నీ ఆఫీసుకు, ఒలేథ్ పోలీసులకు నా కృతజ్ఞతలు’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల జీపీఎస్ తయారీ సంస్థ ‘గర్మిన్’లో ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీర్, ప్రోగ్సామ్స్ మేనేజర్‌గా పనిచేసేవారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ నుంచి ఎలక్ట్రికల్, అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
సునయన శాంతి ర్యాలీ
హూస్టన్: అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కూచిభొట్ల 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్ నుంచి హత్యకు గురైన బార్ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది. -
కూచిభొట్ల కేసులో నిందితుడి నేరాంగీకారం
వాషింగ్టన్: భారతీయ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసు విచారణ త్వరలో ముగియనుంది. ఈ నేరానికి పాల్పడినట్లు మాజీ నేవీ ఉద్యోగి ప్యూరింటన్ అంగీకరించటంతో అతనికి యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 22న శ్రీనివాస్ తన స్నేహితుడు అలోక్ మాడసానితో కలిసి బార్లో ఉండగా ప్యూరింటన్(52) జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ తుపాకీతో వారిపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారులు పూర్తి ఆధారాలు సమర్పించటంతో తాజాగా జరిగిన విచారణలో తానే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీనిపై జడ్జి చార్లెస్ డ్రోగ్ మాట్లాడుతూ..ప్యూరింటన్‌కు హత్య నేరం కింద జీవిత కాల జైలు శిక్ష, హత్యాయత్నానికి 12 నుంచి 54 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. అయితే, విద్వేషపూరిత నేరం రుజువైతే అదనంగా మరో శిక్ష ఉంటుందని తెలిపారు. తాజా పరిణామాన్ని శ్రీనివాస్ భార్య సునయన స్వాగతించారు. ‘ఈ తీర్పుతో శ్రీనివాస్‌ను తిరిగి పొందలేను. కానీ, విద్వేషపూరిత నేరాలకు పాల్పడే వారికి ఇది ఒక హెచ్చరిక’ అని పేర్కొన్నారు. మే 4వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. -
కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?
కాన్సాస్: అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస్ కూచిభొట్ల కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ కేసులో నిందితుడైన ఆడమ్ పురింటన్‌పై జాత్యాహంకార దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న కాన్సాస్‌లో శ్రీనివాస్‌ను హత్య చేసి.. మరో ఇద్దరిని నిందితుడు ఆడమ్ పురింటన్ గాయపరిచాడు. ఈ కేసులో నిందితునికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. తమ దేశం విడిచి వెళ్లండి అంటూ బిగ్గరగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి కోర్టుకు తెలిపాడు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోగా.. మరో ప్రవాసుడు ఆలోక్ మాదసాని గాయపడ్డారు. వీరిని కాపాడేందుకు యత్నించిన 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు.