ఎర్రగుంట్ల మండలం మేకలబాలాయపల్లెకు చెందిన ఓ బాలిక(15)పై కొందరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ అవమానభారం భరించలేక ఆమె ఆత్మహత్యకు యత్నించింది. కలమల్ల పోలీసుల కథనం మేరకు..
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : ఎర్రగుంట్ల మండలం మేకలబాలాయపల్లెకు చెందిన ఓ బాలిక(15)పై కొందరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ అవమానభారం భరించలేక ఆమె ఆత్మహత్యకు యత్నించింది. కలమల్ల పోలీసుల కథనం మేరకు.. మేకలబాలాయపల్లె గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 5వ తేదీ రాత్రి వాటర్ ట్యాంకు సమీపంలోని కంపచెట్లలోకి బహిర్భూమికి వెళ్తున్న సమయంలో సుబ్రమణ్యం, సుబ్బరాయుడు అనే వ్యక్తులు ఆ బాలికను అక్కడే ఉన్న ఓ గదిలోకి లాక్కెళ్లారు.
ఆ తర్వాత బాలిక ఏడ్చుకుంటూ వెళ్తుండగా గమనించిన ఆమె తండ్రి సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గదిలో సుబ్రమణ్యం, సుబ్బరాయుడు ఉన్నారు. తన కుమార్తెపై సుబ్రమణ్యం, సుబ్బరాయుడు అత్యాచారం చేశారని, అందుకు సుబ్రమణ్యం భార్య బుజ్జి, బాలగురివిరెడ్డి, ప్రసాద్ సహకరించారని పేర్కొంటూ కలమల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక బాలిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కడప అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఎర్రగుంట్ల ఎస్‌ఐ సంజీవరెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. అలాగే శనివారం బాలిక వాంగ్మూలం కోసం కడప అర్బన్ సీఐతో పాటు కలమల్ల పోలీసు సిబ్బంది కర్నూలుకు వెళ్లారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.