వదినపై మరిది లైంగిక వేధింపులు
వివాహిత ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు
వినుకొండ టౌన్ వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ జి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న రాత్రి 7.30 గంటల సమయంలో మసీదు మాన్యం 2వ లైనులో పఠాన్ సాజిదా ఆత్మహత్య చేసుకున్న సంఘటన విదితమే. సాజిదా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి సాజిదాపై మరిది పఠాన్ ఫైరోజ్‌ఖాన్ లైంగింక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది.
మరిది వేధింపులను భరించలేని సాజిదా భర్త రహమాన్, అత్త రిజ్వానా, తోడికోడలు నజీనాలకు మొరపెట్టుకుంది. సాజిదాకు అండగా నిలవాల్సిన వారు ముగ్గురు ఆమెను మరింత అవమానించి, అనుమానించి వేధింపులకు దిగడంతో తట్టుకోలేకపోయింది. దీంతో రెచ్చిపోయిన మరిది లైగింక వేధింపులను ఉధృతం చేశాడు. ఒకవైపు మరిది తీరు, మరొకవైపు ఉమ్మడికుటుంబంలోని కుటుంబ సభ్యుల తీరు బాధితురాలిని ఆత్మహత్యకు పురిగొల్పాయి.
దీంతో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసును శోధించి సాజిదా మరిది ఫైరోజ్‌ఖాన్, భర్త రహమాన్, అత్త రిజ్వానా, తోడికోడలు నజీనాలను వారి ఇంటి వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఎస్సైలు ఎల్.ఎన్.రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.