ఇంటర్‌మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన సడలిపోయింది. గురువారం పరీక్ష సమయం దాటి ఐదు నిమిషాల వరకు విద్యార్థులకుఇచ్చారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల వారు కొందరు విద్యార్థులకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో ఇంటర్‌మీడియట్ బోర్డు.. ఈ నిబంధనను విధించింది.
దీంతో బుధవారం విద్యార్థులు పలు అవస్థలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న పరీక్ష కేంద్రానికి రావడానికి బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. కర్నూలు నగరంలోనూ ట్రాఫిక్ విద్యార్థులకు పరీక్ష పెట్టింది. దీంతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, వారిని ఇన్విజిలేటర్లు వెనక్కి పంపించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అదీగాక 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలో ఉండాలనే నిబంధన విద్యార్థులను మరింత ఇరుకున పెట్టింది.
దీంతో 9.05 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. గురువారం ఈ మేరకు చర్యలు తీసుకోవడంతో గైర్హాజరు శాతం తగ్గింది. రెండో రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగగా.. మొత్తం 37,956 మందికి గాను 31,906 మంది హాజరయ్యారు. బుధవారం నాటితో పోలిస్తే గైర్హాజరుశాతంతో పాటు 8.45 నుంచి 9 గంటల మధ్యలో వచ్చే విద్యార్థుల సంఖ్య 61కి తగ్గింది. ఇదిలా ఉండగా బి.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూం నంబర్లు సరిగ్గా వేయలేదని పేర్కొంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఉస్మానియా కళాశాలలో వరండాలో నేలపై విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్ష రాయించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
8.15 నుంచే అనుమతించాలి
ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులను 8.15 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. కొన్ని కేంద్రాల్లో 8.30 గంటలు దాటినా అనుమతించడం లేదన్న ఫిర్యాదులు రావడంతో, దీంతో ఆయా కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
విధుల నుంచి ఇన్విజిలేటర్ తొలగింపు
అరబిక్ పేపర్‌కు బదులు ఉర్దూ పేపర్ ను ఇచ్చిన ఇన్విలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని మాస్టర్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో నారాయణ కళాశాల విద్యార్థిని షేక్ అర్షియాసమ్రీన్‌కు బుధవారం అరబిక్ పేపర్ బదులు విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్ ఉర్దూ పేపర్‌ను ఇచ్చారు. ఈ విషయమై ఇన్విజిలేటర్‌కు పలుమార్లు చెప్పినా స్పందించకపోవడంతో ఆమె నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐవో ప్రాథమిక విచారణ జరిపి, సదరు ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.