శంషాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్ పంచాయతీకి ఆ దాయ పన్నుశాఖ నుంచి కష్టాలొచ్చిపడ్డాయి. ఐదేళ్లుగా పంచాయతీ ఆదా యం నుంచి ఆదాయపుపన్ను శాఖకు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి. మొండి బకాయిలను వసూలు చేయడంలో భాగంగా సదరు శాఖ అధికారులు పంచాయతీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. పన్ను కట్టేంతవరకూ పంచాయతీ అధికారులు ఈ ఖాతాలను వాడుకునేందుకు అవకా శం లేదు. దీంతో పంచాయతీ పరిస్థి తి అగమ్యగోచరంగా మారింది. రెండు నెలలుగా కార్మికులు, సిబ్బం దికి సంబంధించిన వేతనాలతో పాటు పంచాయతీలో చెల్లించాల్సిన వివిధ బిల్లులు నిలిచిపోయాయి.
నెలరోజుల క్రితం పంచాయతీ కార్యదర్శితో పాటు ఇద్దరు బిల్‌కలెక్టర్లు సస్పెండ్ కావడంతో పంచాయతీలో పనులు పదిహేనురోజుల పాటు నిలిచిపోయాయి. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఇప్పటికే కార్మికులు ధర్నాకు దిగారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇన్‌కంటాక్స్ అధికారులు కూడా పంచాయతీ నుంచి సొమ్మును రాబట్టుకునేందుకు ఒత్తిడి పెంచుతుండటంతో పంచాయతీలో బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. 2007 నుంచి పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు చేపట్టిన బిల్లుల్లో ఇన్‌కంటాక్స్ సుమారు రూ.15లక్షల వరకు విడుదల కావాల్సి ఉంది.
కేసుల కష్టాలు...
జీవో 111 కారణంగా అనుమతులు రద్దుకావడంతో ఇప్పటికే ఆదాయం కోల్పోయిన పంచాయతీకి.. కోర్టుల చుట్టూ తిరుగుతుండడంతో కష్టాలు మరింత పెరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రారంభంలోనే నిలిపివేయాల్సిన అధికారులు ఆ సమయంలో మిన్నకుండి ఇప్పుడు వాటి అనుమతులు రద్దుచేసిన తర్వాత కష్టాలు మరింత పెరిగాయి. సుమారు నాలుగువందల వరకు ఇలా రద్దయిన అనుమతులకు సంబంధించిన లభ్ధిదారులు స్టేలు తీసుకోవడంతో వాటికి కౌంటర్‌లు వేయడానికి రూ.లక్షల్లో వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో పంచాయతీకి మరింత కష్టాలు ముదిరాయి. శంషాబాద్ పంచాయతీ పరిపాలన తీరు ఎప్పటికి గాడిలో పడుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.